ప్రతీకాత్మక చిత్రం
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని దుర్గగుడి వీధిలో మధుస్మిత మహాపాత్రో(45) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. రెండు నెలల క్రితమే భర్త చనిపోవడంతో మనోవేదనకు గురైన ఈమెని బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈమె ఓ అద్దె ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉదయం ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండకపోవడంపై సందేహం వ్యక్తం చేసిన ఇరుగుపొరుగు వారు ఆమెని పలిచారు.
అయినా ఆమె ఇంటి లోపలి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగ్గొట్టి, చూడగా ఉరికి వేలాడుతున్న మధుస్మిత మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి మృతదేహం తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.