నిందితుడు చంద్రకాంత్
నిజామాబాద్ సిటీ: మతి స్థిమితం సరిగ్గాలేని ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. యువతికి పెద్దమ్మ తన ఇంట్లో ఆశ్రయమిచ్చింది. ఆ యువతిపై ఓ కానిస్టేబుల్ కన్నేయగా, పెదనాన్న సైతం తోడయ్యాడు. ఇద్దరూ కలిసి యువతిపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని పెద్దమ్మ అడ్డుకోక పోగా సహకరించింది. ఫలితంగా యువతి 8 నెలల గర్భవతి అయింది. ఇటీవల అత్యాచారయత్నంతో నిందితులు దొరికి పోయారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో జరిగిన ఈ అమానవీయ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో యువతికి మూడేళ్ల వయస్సున్నçప్పుడే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తాగుడుకు బానిసైన తండ్రి కొన్నాళ్లకు మరణించాడు. దీంతో అమ్మమ్మ పెంచి పోషించింది. నాలుగేళ్ల కిందట అమ్మమ్మ కూడా చనిపోవడంతో యువతిని పెద్దమ్మ మల్లపూర్తి రామవ్వ చేరదీసింది.
రామవ్వ స్థానిక కంఠేశ్వర్‌లోని ఓ హాస్టల్‌లో పనిచేస్తోంది. రామవ్వకు పరిచయం ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్ మద్యం సేవించేందుకు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో యువతిని లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని అవకాశంగా తీసుకుని పెదనాన్న వరుసయ్యే రామవ్వ భర్త గంగారాం కూడా యువతిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. యువతికి గర్భం దాల్చిన విషయం గమనించకుండా బలవంతంగా మద్యం తాగించేవారు. మత్తు మాత్రలు సైతం వేసేవారు.
నిందితునికి దేహశుద్ధి చేసిన స్థానికులు...
బుధవారం రాత్రి గంగారాం యువతిని మంచానికి కట్టేసి లైంగికదాడికి పాల్పడబోతుండగా గమనించిన స్థానికురాలు ఒకరు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. గంగారాంను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ కూడా లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింబాద్రి, సిబ్బంది వచ్చి గంగారాం, రామవ్వలను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కానిస్టేబుల్ చంద్రకాంత్‌ను పట్టుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నగరంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న నిందితుడు ఎల్ చంద్రకాంత్‌ను సీపీ నాగరాజు గురువారం సస్పెండ్ చేశారు. ఐద్వా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బని లత బాధితురాలి పక్షాన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గర్భవతి అయిన యువతిని చంపేందుకు సైతం నిందితులు యత్నిం చారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment