నిజామాబాద్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ బుధవారం నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (ప్రత్యేక పోక్సోకోర్టు) సీహెచ్ పంచాక్షరి తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన భరషవార్ ఉమేష్ అదే మండలానికి చెందిన ఇంటర్ చదివే ఓ బాలికను నమ్మించి 12 ఫిబ్రవరి 2016న కాలేజీ నుంచి తన ఆటోలో తీసుకెళ్లాడు.
రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి తెలిసిన బంధువులు, ప్రాంతాలలో వెతికినా ఆచూకి లభ్యంకాలేదు. అనంతరం గ్రామంలోని ఆటో డ్రైవర్ కనిపించక పోవటంతో అతనిపై అనుమానం కలిగి 13న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికను బాన్సువాడకు తీసుకెళ్లి సినిమా చూపించి, అనంతరం బాసర, కరీంనగర్ ప్రాంతాలలో తిప్పి లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
ప్రాథమిక విచారణ చేపట్టిన అప్పటి బోధన్ ఏసీపీ వెంకటేశ్వర్లు అభియోగ పత్రాలను కోర్టులో సమర్పించారు. నేర విచారణలో భాగంగా 12 మంది సాక్ష్యాలను ప్రత్యేక పోక్సోకోర్టు నమోదు చేసింది. 16 సంవత్సరాల బాలికను అపహరించి లైంగిక దాడి చేశాడని నిర్ధారిస్తూ, ఉమేష్‌పై నేరారోపణలు రుజువైనట్లు ప్రకటిస్తూ అపహరణ నేరానికి మూడు సంవత్సరాల కఠిన కారాగార జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా, పోక్సోకోర్టు చట్ట ప్రకారం లైంగిక దాడి నిరూపణ కావటంతో 20 ఏళ్ల కఠిన జైలుశిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం మరో మూడేళ్ల సాధారణ జైలుశిక్ష అ నుభవించాలని, రూ.2వేలు జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా ప్రతి నేరానికి ఆరునెలల జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. బాధితురాలికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ రూ. 2లక్షల పరిహారం అందజేయాలని తీర్పులో సిఫార్సు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment