రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మోతిషీమ్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ శుక్రవారం వీరంగం సృష్టించాడు. కొందరిపై తుపాకీతో కాల్పులు జరపడంతోపాటు తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిలో బుల్లెట్ గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరొకరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
అదుపులోకి తీసుకున్నాం: ఓఎస్‌డీ
ఈ ఘటనపై జిల్లా ఓఎస్‌డీ రాజేశ్‌చంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఫారూఖ్ అహ్మద్ 0.32 ఎంఎం పిస్టల్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని, జమీర్‌కు రెండు బుల్లెట్‌లు, మోతిషీమ్‌కు ఒక బుల్లెట్ తగిలిందన్నారు. నిందితుడు ఫారూఖ్ అహ్మద్‌పై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, రిమ్స్ ఆస్పత్రిలో బాధితులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరామర్శించారు.
చిచ్చురేపిన క్రికెట్..
జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వారిని తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment