ప్రభుత్వం చేసిన మంచి ఎవరూ చెప్పకూడదనే ప్రతిపక్షాల కుట్ర
చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ల పాత్ర కూడా ఉండొచ్చు
కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
కూటమికి మహిళాలోకం బుద్ధి చెప్పాలి
కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి రజిని, వైసీపీ నేతలు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు.
మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పవిత్ర పరామర్శించారు.
గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్‌చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు...
ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది.
గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ
సోషల్ మీడియా టెర్రరిజం
గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు.
ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా
టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య
గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్
పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం...
గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే
గీతాంజలిని దారుణంగా వేధించారు..
ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్‌ఎం పవిత్ర, చైర్‌పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment