![Minors Molested 13 Year Old Boy in UP Aligarh - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/6/representation.jpg.webp?itok=MA6e-tFW)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: పదమూడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు. ఆపై, విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. కానీ ఇంటికి చేరుకున్న బాధితుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు అతడిని నిలదీయగా నిజం బయటపడింది. ఈ అమానుషకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వివరాలు.. అలీఘడ్ జిల్లాలోని లోధా ప్రాంతానికి చెందిన బాలుడిని అతడి తండ్రి స్థానిక మార్కెట్‌కు పంపించాడు. వ్యవసాయ ఉత్పత్తులు కొని తీసుకురమ్మని చెప్పాడు. బాధితుడు ఒంటరిగా వెళ్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరు టీనేజర్లు, తనకు తోడుగా ఉంటామంటూ బయల్దేరారు.
ఈ క్రమంలో అతడిని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, రూ. 20 తీసుకుని సైలెంట్‌గా ఉండాలంటూ నోరు మూయించారు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ముభావంగా ఉన్న బాలుడిని చూసి తండ్రి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితులు ఇద్దరు తమ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లేనని, పిల్లాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురువారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment