ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,దుబ్బాక( మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లీకూతురు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో చిన్న కుమార్తె చైత్ర(5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతులోకి వెళ్లింది.
గమనించిన తల్లి చైత్రను కాపాడటానికి ముందుగా తన చీరను విసిరింది. చీరను అందుకోకపోవడంతో తానే నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ నీటమునిగి ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. చెరువు గట్టుపై ఉన్న పెద్దకుమార్తె రషి్మక, మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద ఉన్న వారు గమనించి మృతదేహాలను బయటకు తీశారు.
రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్‌తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రోజా ఇటీవలె తల్లిగారింటికి వచ్చింది. బతుకమ్మ పండగ రోజు తల్లీ కూతురు మృతి చెందడంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మా అమ్మ కావాలే..లే అమ్మా
తల్లి, చెల్లి మృతి చెందడంతో రష్మిక ఏమి చేయలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నది. తల్లిదండ్రులను కోల్పోయిన రష్మిక ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. నాకు మా అమ్మ కావాలి.. నువ్వు లే అమ్మా అంటూ ఆ చిన్నారి ఏడవడంతో అందరూ కంటతడి పెట్టారు. చెల్లి చేతులు పట్టుకుని లే చెల్లె ఆడుకుందాం అంటూ ఏడ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment