![Mother Attemp Sucide Including Children Due To Family Disputes - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/21/wifehus.jpg.webp?itok=qQ499Aq3)
అమ్మా.. నవమాసాలు మోసి మాకు జన్మనిచ్చావు. అల్లారుముద్దుగా పెంచావు. గోరుముద్దలు తినిపించావు. ఏ చిన్న జబ్బు చేసినా నీవు తల్లడిల్లి పోయావు. నీవే కొండంత అండ అని భావించాము. నీళ్లు చూస్తుంటే భయమేసింది.. అయినా నువ్వున్నావన్న ధైర్యంతో నీవెంటే నడిచాము. నీటిలో ఊపిరి ఆడలేదు. బయటకు తీయమ్మా... అని వేడుకున్నాం. కానీ అప్పటికే అంతా అయిపోవడంతో చిన్నారులు తల్లితో పాటు ప్రాణాలు విడిచారు.
శింగనమల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు బుధవారం శింగనమల రంగరాయల చెరువులో బయటపడ్డాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన బి.రామాంజినేయులుకు పదేళ్ల క్రితం పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన కవిత(27)తో వివాహమైంది. వీరికి సంతోష్ (7), భార్గవి (3) సంతానం. గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.
అయితే..నాలుగు నెలల క్రితం తాడిపత్రి పట్టణానికి మకాం మార్చారు. రామాంజినేయులు గుజిరీ షాపులో పనికి వెళుతుండగా.. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది. రామాంజనేయులు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రోజూ దంపతులు రోజూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా వాదులాడుకున్నారు. భర్త ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం ఉదయం 11 గంటల తరువాత పుట్టింటికి వెళుతున్నానని భర్తకు చెప్పిన కవిత కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. బస్సులో బయల్దేరి శింగనమల క్రాస్ వద్ద దిగింది.
అక్కడి నుంచి పిల్లలతో కలిసి రంగరాయల చెరువు మరవకట్టపైకి నడుచుకుంటూ వెళ్లింది. జీవితం నరకప్రాయంగా అనిపించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిల్లలు దిక్కులేని వారు కాకూడదని.. వారినీ తనవెంటే తోడు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని చెరువులోకి దూకారు. బుధవారం మధ్యాహ్నం ముగ్గురి మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అనంతపురం ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, శింగనమల సీఐ అస్రార్ బాషా, ఎస్‌ఐ వంశీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీయించి..పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, పిల్లలు చనిపోయినా భర్త సంఘటన స్థలం వద్దకు రాలేదు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment