నెల రోజుల్లో పెళ్లి.. చేతిలో చిల్లిగవ్వ లేక | Mother Committed Suicide With Two Daughters In Khammam | Sakshi
Sakshi News home page

పెళ్లికి చిల్లిగవ్వ లేక.. తల్లీ, ఇద్దరు కూతుళ్ల బలవన్మరణం

Published Fri, Dec 11 2020 4:41 AM | Last Updated on Fri, Dec 11 2020 4:48 AM

Mother Committed Suicide With Two Daughters In Khammam - Sakshi

సాక్షి , ఖమ్మం : పెళ్లి కుదిరిందని అంతా సంతోషించారు. కానీ, ఆ పెళ్లిని పీటలదాకా ఎలా తీసుకెళ్లాలో తెలియలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కన్యాదానం ఎలా చేయాలో ఆ తల్లికి పాలుపోలేదు. ఎవరినైనా సాయం అడగాలన్నా మొహమాటం అడ్డువచ్చింది. అమ్మాయిని చేసుకోబోయే వారి కుటుంబం రెండు రోజుల్లోనే ఇంటికి రానుండటంతో మరింత మనోవేదన చెందారు. ఇక చేసేది లేక మృత్యువునే ఆశ్రయించింది. 

చేతినిండా పనిలేక..
ఖమ్మం గాంధీచౌక్‌లో నివాసం ఉంటున్న గోవిందమ్మ(49), ఆమె కూతుళ్లు రాధిక(29), రమ్య(28) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందమ్మ భర్త ప్రకాశ్‌ మహబూబాబాద్‌లో స్వర్ణకార వృత్తిని నిర్వహిస్తుంటాడు. ప్రకాశ్‌ కుటుంబం 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం వరంగల్‌ నుంచి ఖమ్మం వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా 6 నెలలుగా పనులు లేకపోవడం.. లాక్‌డౌన్‌ నుంచి బయటపడ్డా చేతినిండా పనిలేక ప్రకాశ్‌ కుటుంబానికి ఇల్లు గడవడం కష్టంగా మారింది.

 బంగారానికి మెరుగుపెట్టే సైనేడ్‌ తాగి..
ఈ క్రమంలోనే గోవిందమ్మ, రాధిక, రమ్య బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బంగారాన్ని మెరుగు పెట్టేందుకు వాడే సైనేడ్‌ ద్రావణాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 11.30 గంటలకు ప్రకాశ్‌ మహబూబాబాద్‌ నుంచి ఇంటికి రాగా.. ఎంతకూ తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి నగరంలోనే ఉండే తన తోడల్లుడైన చిదంబరానికి ఫోన్‌ చేశారు. ఆయనతోపాటు బంధువులు వచ్చి త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా.. ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ప్రకాశ్‌ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఆత్మాభిమానమే..
లాక్‌డౌన్‌ సమయంలో ప్రకాశ్‌ కుటుంబానికి స్వర్ణకారుల యూనియన్‌ చేదోడువాదోడుగా ఉంది. ప్రకాశ్‌కు ముగ్గురు సోదరులు, గోవిందమ్మకు ఏడుగురు అక్కాచెల్లెళ్లు.. వారిని సాయం అడిగేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చింది. రాధిక పెళ్లికి అయిన వారందరూ తలా ఒక చేయి వేస్తారని భరోసాగా ఉన్నా.. పెళ్లి సమయం దగ్గర పడుతుండటం.. ఆశించిన వారి నుంచి సరైన స్పందన లేకపోవడం వారిని ఆత్మహత్యకు పురిగొల్పినట్లు తెలుస్తోంది.   

అటు పెళ్లి.. ఇటు పేదరికం
ఈ క్రమంలో రాధికకు పెళ్లి చేయడం ఆ కుటుంబానికి పెనుసవాల్‌గా మారింది. జనగామలోని వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి రాధికను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. నిశ్చయతాంబూలాలు సైతం పూర్తయ్యాయి. జనవరి 11న పెళ్లి జరగాల్సి ఉంది. లాంఛనాలు లేకుండా పెళ్లి చేసుకోవడానికి వరుడు ఒప్పుకున్నా.. గోవిందమ్మ కుటుంబం మాత్రం తన పిల్లను వట్టి చేతులతో ఎలా పంపాలని 10 రోజులుగా కుమిలిపోయింది. ఇలా ఉండగా, రెండు రోజుల్లో ఇంటికి భోజనాలకు వస్తామని.. బట్టలు కలిసి సెలెక్ట్‌ చేద్దామని వరుడి కుటుంబం సమాచారమివ్వడం.. ఇంట్లో గ్యాస్‌ అయిపోవడం.. బియ్యం లేకపోవడంతో వీరు మరింత మనోవేదన చెందారు.  

అక్కా చెల్లెలు తాత్కాలిక ఉద్యోగం
కొద్దిరోజులు రాధిక, రమ్య తాత్కాలిక ఉద్యోగులుగా స్థానిక పోస్టాఫీస్‌లో పనిచేశారు. అయితే సాయం చేస్తారనే నమ్మకం లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరితోనూ పంచుకోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement