సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాలు అనేక మంది ఉంటున్నారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలానే నగరానికి చేరుకుని, స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు కార్డులు పొందిన మహ్మద్ ఫారూఖ్‌తో పాటు ఇతడికి సహకరించిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడు ఖదీరుద్దీన్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఫారూఖ్ విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల “ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది రోహింగ్యాలు ఆ దేశం విడిచిపెడుతున్నారు. వీటిలో అత్యధికులు భారత్‌కు వలస వస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా ప్రకటించుకుని ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు కార్డులు పొంది ఆశ్రయం పొందుతున్నారు. మరికొందరు అక్రమ మార్గంలో వచ్చి చేరుతున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతూ, పశ్చిమ బెంగాల్ వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడి మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో గుర్తింపుకార్డులు పొందుతూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మారుతున్నారు.
♦ మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు.
♦ ఈ మార్గంలో ఎక్కడా తమ ఉనికి అక్కడి పోలీసులు, సాయుధ బలగాలకు తెలియకుండా చూసుకుంటున్నారు. దీనికోసం ప్రధానంగా తెల్లవారుజామున ప్రయాణం సాగిస్తున్నారు.
♦ మాంగ్డో నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నఫ్ నది తీరానికి వస్తున్న వీరికి ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు సహకరిస్తున్నారు.
♦ రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు.
♦ ఆద్యంత అక్రమంగా సాగే ఈ ప్రయాణంలో అడుగడుగునా ఉండే దళారులు వీరికి సహకరిస్తున్నారు. దీనికోసం సమయం, అవసరం, అవకాశాలను బట్టి రేటుకట్టి డబ్బు వసూలు చేస్తున్నారు.
♦ టెక్నాఫ్ నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు.
♦ అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుంటున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని, అక్కడ నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో చేరుతున్నారు.
♦ ఇక్కడ మరోసారి రంగంలోకి దిగే దళారులు వీరికి సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో దాచి ఉంచుతున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నదిని దాటిస్తూ భారత్‌లోకి పంపుతున్నారు.
♦ పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బీహార్, జమ్మూకాశ్మీర్‌లకు వెళ్తున్నారు.
♦ ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులం అంటూ చెప్పుకుని తొలుత ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు.
♦అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment