
చెన్నై(తమిళనాడు): టీ నగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై పెట్రో బాంబు దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు దుండగులు పెట్రోల్ బాటిళ్లతో ఆఫీస్‌పై దాడికి తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటనకు సంబంధించి వినోద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నీట్ పరిణామాలతోనే తాను బీజేపీ ఆఫీస్‌పై పెట్రోల్ బాంబుతో దాడి చేశానని ఆ యువకుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే..
ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై. వినోద్ ఒక రౌడీ షీటర్ అని.. చదువుకు అతనికి పొంతన లేదని, అలాంటప్పుడు నీట్ వ్యతిరేకంగా దాడి ఎందుకు చేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉండొచ్చని.. ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాడు. ఇక దాడి అనంతరం ఆఫీస్‌ను పరిశీలించిన అన్నామలై.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
ఇదిలా ఉండగా.. నీట్‌పై తమిళనాడు ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వ్యతిరేక బిల్లు సైతం రూపొందించి ఆమోదించగా.. బీజేపీ అడ్డుచెప్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. కొన్ని నెలల తర్వాత పరిశీలించిన గవర్నర్.. బిల్లును ఆమోదించకుండానే అసెంబ్లీకి వెనక్కి తిప్పి పంపారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిణామాలు తట్టుకోలేకనే తాను దాడికి పాల్పడినట్లు వినోద్ చెప్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరితో కలిసి పెట్రల్ సీసాలను బీజేపీ ఆఫీసుల్లోకి విసిరాడు వినోద్. ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాలకు బానిసైన వినోద్‌పై రౌడీ షీట్ కూడా ఉందని, సీసీ ఫుటేజీ ద్వారా మిగతా నిందితులను పట్టుకుంటామని టీనగర్ డీసీపీ హరి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment