సాక్షి, చీడికాడ (విశాఖపట్నం): తండ్రి మందలించాడన్న మనస్తాపంతో పురుగు మందు తాగిన నవ వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని కోనాం శివారు గిరిజన గ్రామం గుంటిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుధాకరరావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. గుంటి గ్రామానికి చెందిన కాదలి రాజుకు పక్క గ్రామమైన గుంటి కొత్తూరుకు చెందిన గర్శింగి అచ్చిబాబు కుమార్తె దేవి (18)కి మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇటీవలకాలంలో ప్రతిరోజు దేవి తండ్రి అచ్చిబాబు అల్లుడి స్వగ్రామమైన గుంటి వచ్చి సారా సేవించి వెళ్తుండేవాడని ఎస్‌ఐ తెలిపారు.
గమనించిన అల్లుడు రాజు మామ అచ్చిబాబును మూడు రోజుల క్రితం మందలించాడు. దీనిపై తన తండ్రిని ఎందుకు మందలించావని భర్త రాజుతో దేవి గొడవ పడి రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. మేము గొడవ పడితే నీకెందుకమ్మా అని దేవిని తండ్రి అచ్చిబాబు మందలించి శుక్రవారం భర్త దగ్గరకు పంపించేశాడు. దీంతో మనస్తాపం చెందిన దేవి శుక్రవారం రాత్రి పురుగు మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను భర్త, కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
చదవండి: (ఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో..)
Comments
Please login to add a commentAdd a comment