కొత్తపుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలు
మనకు తెలియకుండా ఇళ్ల ముందు లెటర్లు
అడ్రస్ తప్పు ఉంది..స్కాన్ చేయండని లెటర్‌పైనే క్యూఆర్‌కోడ్
పొరపాటున స్కాన్ చేశారా? ఖాతా ఖాళీ
పలమనేరు: ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌కు లింకులు, ఫేస్‌బుక్ హ్యాకింగ్స్, బ్యాంకు అధికారుల పేరిట ఫేక్ కాల్స్, ఓటీపీలు, మన ఫోన్ ఎవరికైనా కాల్ కోసం ఇస్తే దాంట్లో సెట్టింగ్స్ మార్చేయడం, ఫేక్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఫోన్ హ్యాకింగ్, ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు, తాజాగా బయటి ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న లేదా ఉద్యోగాల చేస్తున్న వారి నంబర్ల ఆధారంగా వారి కుటుంబీకులకు డిజిటల్ అరెస్ట్‌లు సర్వసాధారణంగా మారాయి.
ఈ సైబర్ నేరాలకు సంబంధించి పోలీసులు, వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లు సైతం బాధితులను రక్షించలేకపోతున్నాయి. తాజాగా మరోకొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎలాంటి వారైనా నమ్మి మోసపోవాల్సిందే.
మీ ఇంటి ముందు ఓ లెటర్‌ను పడేసి..
ఇంటిముందు ఓ లెటర్ లేదా కొరియర్ ఫామ్ పడి ఉంటుంది. దానిపై డేట్, వేబిల్ నంబరు, కొరియర్ లేదా పార్సిల్ కంపెనీ పేరు ఉంటుంది. అందులోని స్కానర్‌ను స్కాన్ చేసి చేంజ్ యువర్ డెలివరీ డేట్, ఆల్టర్‌నేట్ అడ్రస్ తదితర వివరాలు ఉంటాయి. దీన్ని నమ్మి మనకేమైనా పార్సిల్ లేదా లెటర్, వస్తువులు వచ్చాయేమోనని భావించి మన స్మార్ట్‌ఫోన్ ద్వారా దానిపై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేశామో ఇక అంతే సంగతులు.
వెంటనే మన ఫోన్ హ్యాకర్ల గుప్పెట్లోకి పోతుంది. మనఫోన్‌లో జరిగే అన్ని లావాదేవీలను హ్యాకర్స్ డార్క్‌నెట్ ద్వారా గమనిస్తుంటారు. ఇందుకోసం పెద్ద నెట్‌వర్క్ ఉంటుంది. చాలామంది సాఫ్ట్‌వేర్లు ఇందులో పనిచేస్తూ మనం సెల్‌లో చేసే పనులను గమనిస్తుంటారు. బహుశా మనం ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి ఎవరికైనా డబ్బు పంపి మన పిన్‌ను ఎంటర్ చేశామంటే ఆ పిన్‌ను వారు గుర్తిస్తారు.
ఆపై మన ఖాతాలో ఉన్న డబ్బును మనకు తెలియకుండానే కాజేస్తారు. మన సెల్‌కు డబ్బులు కట్ అయినట్లు ఓ ఎస్‌ఎంఎస్ మాత్రం వస్తుంది. ఆపై మనం ఏమీ చేయాలన్నా మన సెల్ హ్యాకర్ల అదుపులో ఉన్నందున మనం ఏం చేసినా లాభం ఉండదు.
నెల రోజులుగా ఈ మోసాలు..
బెంగళూరులో గత నెల రోజులుగా ఇలాంటి ఫేక్ లెటర్లు ఇంటి ముందు పడి ఉండడం, వాటిని స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేసిన వారి ఖాతాల్లో డబ్బు మాయం కావడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి సైబర్ మోసాలు మన చెంతకు చేరడం ఎన్నో రోజులు పట్టదు. మన ఇళ్ల వద్ద ఏదైనా స్కానింగ్ ఉన్న లెటర్ వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment