సాక్షి, దౌల్తాబాద్: (సిద్దిపేట)పెళ్లైన మూడురోజులకే కొత్త పెళ్లికొడుకు మృత్యుఒడికి చేరుకున్నాడు. చెరువులో పడిన తన అన్న కుమారుడిని రక్షించే యత్నంలో బురదలో ఇరుక్కొని కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్‌లో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మౌలాన్‌సాబ్, జహీరాబీ దంపతులు తమ ఐదుగురు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. చిన్న కుమారుడు యాసిన్ (23) వివాహం గురువారం నగరంలో ఘనంగా జరిపించారు. ఈ క్రమంలో స్వగ్రామంలో గ్రామస్తులకు, బంధువులకు ఆదివారం విందు ఏర్పాటు చేయాలని భావించి అందుకు సంబంధించిన ఏర్పా ట్లు చేశారు.
ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కలిసి శనివారం మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లి సరదాగా గడపసాగారు. అంతలోనే యాసిన్ అన్న కుమారుడు సమీర్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. దీంతో వెంటనే యాసిన్ అతడిని కాపాడే యత్నం చేశాడు. ఈక్రమంలో చెరువులోని గుంతలో ఇరుక్కుపోయాడు. గట్టున ఉన్న కొందరు సమీర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి గ్రామస్తులు అక్కడికి చేరుకొని యాసిన్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న కొత్తపెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం బాలంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడు సమీర్ క్షేమంగా ఉన్నాడు. మృతుడి తండ్రి మొగులాన్‌సాబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment