మాటలతో మూటలు | Nimmagadda Vanibala is most important in Rs 200 crore scam | Sakshi
Sakshi News home page

మాటలతో మూటలు

Published Wed, May 22 2024 4:55 AM | Last Updated on Wed, May 22 2024 4:55 AM

వాణీబాల

వాణీబాల

రూ.200 కోట్ల స్కామ్‌లో నిమ్మగడ్డ వాణీబాల అత్యంత కీలకం 

చేతులు కాలాక వాణీబాలను సస్పెండ్‌ చేసిన టెస్కాబ్‌ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: శ్రీ ప్రియాంక ఎంటర్‌ ప్రైజెస్‌ చేసిన రూ.200 కోట్ల స్కామ్‌లో టెస్కాబ్‌ మాజీ జనరల్‌ మేనేజర్‌ నిమ్మగడ్డ వాణీబాల పాత్ర కీలకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్ష నిర్వహిస్తున్న ప్రింటింగ్‌ మెటీరియల్‌ సప్లై ఏజెన్సీని ఫైనాన్స్‌ సంస్థగా మార్చడంలో ఆమె పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 517 కాగా, దర్యాప్తు నిమిత్తం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అప్పగించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క టెస్కాబ్‌ అధికారులు వాణీబాలను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారు. వాణీబాల చేసిన మోసంలో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు.  

‘ప్రియాంక’ సంస్థ ఏర్పాటు ఉద్దేశమే వేరు... 
ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985 నుంచి అబిడ్స్‌ తిలక్‌రోడ్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజె­స్, గ్రాఫిక్‌ సిస్టమ్స్‌ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి ఖరీదు చేసి, ప్రింటింగ్‌ ప్రెస్‌ వారికి విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లోనే చేరారు. కొన్నాళ్లుగా ఈ సంస్థ వ్యాపారం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెటీరియల్‌ సరఫరా చేసే కంపెనీల నుంచి దాదాపు రూ.6 కోట్ల మేర క్రెడిట్‌ తీసుకోవడంతోపాటు ఆయా కంపెనీల్లో పనిచేసే వారి వద్ద నుంచి వడ్డీకి భారీగా అప్పులు కూడా తీసుకున్నారు. ఈ సంస్థ ఏటా దాదాపు రూ.6 కోట్ల టర్నోవర్‌ చేస్తుండటంతో తమ నగదు ఎక్కడికీ పోదనే ఉద్దేశంతో పలువురు అప్పులు ఇచ్చారు.  

వాణీబాల సలహాతోనే ఫైనాన్స్‌ సంస్థగా... 
తన భర్త, కుమారుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసిన వాణీబాల తనకున్న పరిచయాలు, ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీ స్కామ్‌కు ప్లాన్‌ చేసింది. ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ను ఫైనాన్స్‌ సంస్థలా మార్చేలా చేసింది. తొలినాళ్లల్లో తన సహోద్యోగులతో పాటు వారి బంధువుల నుంచి డిపాజిట్లు తీసుకుంది. వీరికి సాలీనా 18 నుంచి 24 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. దీంతో వారికి వాణీబాలపై నమ్మకం ఏర్పడి సహకరించడం ప్రారంభించారు. టెస్కాబ్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడానికి వచ్చే వారితో వాణీబాల మాటలు కలిపేది. 

వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకునేది. ఆపై తమకున్న ఫైనాన్స్‌ కంపెనీ విషయం చెప్పి..బ్యాంక్‌లో అయితే కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పేది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకూ సరిపోదని, తన భర్త, కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్‌ చేయాలని సూచించేది. తాము క్రమం తప్పకుండా 20 నుంచి 24 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవీవిరమణ చేసిన వారు తమ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు.  

బ్యాంకు సిబ్బందినీ వినియోగించుకుంది  
జనరల్‌ మేనేజర్‌ హోదాలో ఉన్న నిమ్మగడ్డ వాణీబాల తన భర్తకు చెందిన సంస్థలోకి టెస్కాబ్‌కు రావాల్సిన డిపాజిట్లను మళ్లించింది. దీనికోసం ఆ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. డిపాజిట్ల వ్యవహారాలు పర్యవేక్షించే వారికి కమీషన్ల ఆశ చూపి, వినియోగదారులు ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఇలా టెస్కాబ్‌కు రావాల్సిన డిపాజిట్లు ప్రైవేట్‌ సంస్థకు తరలి వెళ్లిపోతున్నా ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు సీసీఎస్‌లో కేసు నమోదైన తర్వాత వాణీబాలను సస్పెండ్‌ చేసి, విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు. 

తమను సంప్రదించిన బాధితులతో ఆమెకు, బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని తెలిసింది. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి, రూ.1 విలువైన రెవెన్యూ స్టాంప్‌ అతికించి, సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా, గతేడాది నవంబరు, డిసెంబర్‌ నుంచి వడ్డీలు చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్‌ కోర్టులు దివాలా పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేసి ఆ మరుసటి రోజు నుంచి వాణీబాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  

మూడు రాష్ట్రాల్లో వ్యాపారాలంటూ బ్రోచర్లు  
డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ ఎస్‌పీ లోగోతో బ్రోచర్లు ముద్రించింది. వాటిలో తమకు ఎస్‌పీ గ్రాఫిక్‌ సిస్టమ్స్, శ్రీ ప్రియాంక డిజిటల్స్, శ్రీ ప్రియాంక గ్రాఫిక్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు కూడా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని తిలక్‌రోడ్‌తో పాటు జీడిమెట్ల, బెంగళూరులోని రాజాజీనగర్, విజయవాడలోని గాంధీనగర్‌ల్లో వీటి బ్రాంచ్‌లు ఉన్నట్టు పేర్కొన్నారు. తమ వార్షిక టర్నోవర్‌ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్టు వాటిలో స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 

మంగళవారం మరికొందరు బాధితులు సీసీఎస్‌కు రాగా వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు వీరితోపాటు సంబం«దీకులు, ఆయా సంస్థల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న సబ్‌రిజి్రస్టార్‌లకు లేఖలు రాస్తున్నారు. సిటీ సివిల్‌ కోర్టులో నిందితులు దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్‌పై జూలై మూడోవారంలో హియరింగ్‌ జరగనుంది. ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారిలో వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది.  

ఉద్యోగ జీవితంలో సంపాదించింది మొత్తం పెట్టేశా 
మా బంధువు ఒకరు టెస్కాబ్‌ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు దాదాపు రూ.60 లక్షల వరకు ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడి పెట్టారు. వారి ద్వారానే వాణీబాల నాకు పరిచయమైంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన నేను నా ఉద్యోగ జీవితంలో సంపాదించిన రూ.20 లక్షలు వారి వద్ద పెట్టుబడిగా పెట్టాను. సైదాబాద్‌ మనోహర్‌కాలనీలోని వాణీబాల ఇంటికి తాళం వేసి ఉండగా.. బ్యాంకు అధికారులు అక్కడే ఆమె సస్పెన్షన్‌ నోటీసు అంటించారు. సీసీఎస్‌ పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.  
– ఎం.శ్రీనివాసమూర్తి, ల్యాబ్‌ టెక్నీషియన్, కోటి గవర్నమెంట్‌ ఆస్పత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement