
ప్రతీకాత్మక చిత్రం
నోయిడా: వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈరోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ రెండింటి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహజీవనం వంటి సంబంధాలు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఏమాత్రం మార్పు లేదు. ఓ యువకుడి మోజులో పడి తను ప్రేమించిన వ్యక్తిని ఆ యువతి చేతులారా చంపుకున్న ఘటన నోయిడాలో కలకలం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ముఖేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. సొంత ఊరును సైతం వదిలి ఇద్దరూ నోయిడాలో కాపురం పెట్టారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యాభర్తల్లానే కలిసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట జీవితంలోకి అంకుష్ అనే యువకుడి రాకతో వీరి జీవితాలు తలకిందులయ్యాయి. తన ఇంటి పక్కన ఉండే అంకుష్‌తో ముఖేష్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంత కాలం వాళ్లిద్దరూ ముఖేష్ కళ్లుగప్పి వారి సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఇటీవల ముఖేష్‌కు ఈ విషయం తెలియడంతో తాను పెళ్లి చేసుకోకపోయినప్పటికీ భార్యలా చూసుకుంటున్న తనను కాదని అంకుష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు.
ఇంట్లో తమ ఇద్దరు పిల్లలున్న సంగతి కూడా మరచి ఇదేం పనంటూ ఆ యువతిని మందలించాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఈ విషయాన్ని తన ప్రియుడు అంకుష్‌కు చెప్పింది. అంతే కాక ముఖేష్ అడ్డు తొలగించుకోవాలని అంకుష్‌కి చెప్పడంతో ముఖేష్ హత్యకు ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ముఖేష్‌పై లేని ప్రేమను నటించి అతడికి ఆమె మద్యం తాగించింది. మత్తులో తూలిపోయిన ముఖేష్ నిద్రలోకి జారుకోగానే ప్రియుడు అంకుష్‌కి ఫోన్ చేసింది. అంకుష్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్‌ను హతమార్చారు.
ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ముఖేష్ ఇంటి నుంచి పెద్దగా కేకలు విన్పించడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. దీనితో ఆ యువతి మొసలి కన్నీరు కార్చుతూ రాత్రి మద్యం తాగి మత్తులో నిద్రపోయిన ముఖేష్ ఉదయాన్నే ఇలా చనిపోయి కనిపించాడని నాటకమాడింది. పోలీసులతో కూడా ఇదే కట్టుకథను చెప్పి నమ్మించసాగింది.
అయితే.. ఆ యువతి ప్రవర్తనపై పోలీసులకు అనుమానమొచ్చింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమ శైలిలో పోలీసులు విచారించడంతో ముఖేష్‌ను తన ప్రియుడు అంకుష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment