మానస్ స్వాయిన్(ఎడమ).. సర్మిస్తా రౌత్(కుడి)
తమ కొడుకుది సుపారీ హత్యేనని ఆ తల్లిదండ్రులు, తన భర్త మరణం వెనుక కుట్ర దాగుందని, తనకి న్యాయం చేయకపోతే ఆత్మాహుతికి పాల్పడతానంటూ ఓ బాధితురాలు.. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందే ధర్నాకు సిద్ధపడడం సంచలనంగా మారింది. ఓ వెబ్‌పోర్టల్‌లో పని చేసే కెమెరామ్యాన్ హత్యోదాంతం.. ఇప్పుడు ఒడిశాను కుదిపేస్తోంది.
ఓ వెబ్ పోర్టల్‌లో కెమెరామ్యాన్ మానస్ స్వాయిన్(28) హత్య ఉదంతం ఒడిషాను కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్న సదరు వెబ్ పోర్టల్ ఓనర్ సర్మిస్తా రౌత్ ఇంకా పరారీలోనే ఉంది. దాదాపు ఇరవై రోజులు కావొస్తున్న కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులపై విమర్శలు పెరిగాయి. దీంతో ఈ కేసును సీఐడీ క్రైం బ్రాంచ్‌కు కేసు అప్పగించింది ప్రభుత్వం.
మానస్ స్వాయిన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లాడు. ఆ టైంలోనే సర్మిస్తాతో పాటు మరో నలుగురు వ్యక్తులు మానస్‌ను అపహరించి.. భువనేశ్వర్ సుందర్‌పాదాలో సర్మిస్తాకు చెందిన ఓ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు మానస్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యగా నిర్ధారించారు.
చిప్ కోసమేనా?
ఈ కేసు ఓ మెమొరీ చిప్ చుట్టూ తిరుగుతుండడం విశేషం. అందులో సర్మిస్తా, పలువురు ప్రముఖులకు చెందిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని మానస్ స్వాయిన్ ఎక్కడో దాచి పెట్టాడని, తన రాసలీలలు బయటపడతాయనే భయంతోనే ఆమె అతన్ని దారుణంగా హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమెకు ఉన్న పరిచయాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసులో ఒడిషా సమాచార విభాగంలో(OIS) అధికారిగా పని చేసిన నిరంజన్ సేథీని.. మూడు రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన.. తన రిటైర్‌మెంట్‌కు సరిగ్గా ఒక రోజు ముందు సర్మిస్తా నడిపించే ఫోర్ట్‌నైట్లీ మ్యాగజైన్‌కు యాడ్ పర్మిషన్లు ఇప్పించాడు. పైగా మానస్ హత్యకు ముందు రోజు సర్మిస్తా-నిరంజన్ మధ్య దాదాపు అరగంటకు పైగా ఫోన్ సంభాషణలు సాగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అందుకే అరెస్ట్ చేసి.. ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సర్మిస్తా రౌత్ సోదరుడు పరమేశ్వర్‌ను విజయవాడలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రౌత్ తప్పించుకుని పోవడానికి పరమేశ్వర్ కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో రెండు టీంలు రంగంలోకి దిగాయి. ఒకటి రౌత్ కోసం గాలిస్తుండగా.. మరొకటి ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. సర్మిస్తా రౌత్ వేరే రాష్ట్రంలో తలదాచుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే కేసును లోతుగా దర్యాప్తు చేస్తే.. రాజకీయ, హైప్రొఫైల్ సెలబ్రిటీల గుట్టు బయటపడొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment