హైదరాబాద్: ఇటీవల నగరంలో కూకట్ పల్లి ఏటీఏం సెంటర్ వద్ద కాల్పులు జరిపిన ఏ1, ఏ2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ సీపీ వారిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ పొట్టకూటి కోసం బీహార్‌కు చెందిన ఏ1 నిందితుడు అజిత్ కుమార్, ఏ2 నిందితుడు ముఖేష్ కుమార్లు 2011లో నగరానికి వచ్చారు. నగరంలోని దుండిగల్ ప్రాంతంలో ప్యాకేజీ అండ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పని చేసిన వీళ్లిద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు.
తొలిసారి ఏ1 నిందితుడు అజిత్ కుమార్ దుండిగల్‌లోని ఓ ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ జైలు పాలయ్యాడు. విడుదల అనంతరం నేరాల్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అడ్డదార్లలో డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవాడు. దొంగతనాలు చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకునేవాడు. చిన్నాచితకా దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఈ సారి ఏకంగా ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాల్ని టార్గెట్ చేశాడు. అందుకు ముఖేష్ కుమార్ సపోర్ట్ తీసుకున్నాడు. బీహార్ నుంచి ముఖేష్‌తో నాటు తుపాకి తెప్పించుకుని ఏప‍్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం చోరీకి ప్రయత్నించారు.
ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఏటీఎం నుంచి డబ్బుల్ని దొంగిలించేందుకు ఏటీఎం సెంటర్‌లో విధులు నిర్వహిస్తున‍్న సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల‍్లో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఏటీఎం డోర్లపై థంబ్ ప్రింట్స్ ఆధారంగా పాతనేరస్తులపై కన్నేశారు. అయితే కూకట్ పల్లి ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న నిందితుల చేతిగుర్తులు.. గతంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితుల చేతి గుర్తులు ఒకేలా ఉండడంతో అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితులు గుండపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గదిలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు నిందితులు కలిసి సైబరాబాద్ లిమిట్స్‌లో ఐదు నేరాలు చేశారు. వారి వద్ద నుండి రూ. 6,31,000/- నగదు, ఒక పిస్తోల్, ఒక మ్యాగజైన్, పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నాం. ఏటీఎం సెక్యూరిటీగా పెద్ద వయస్సు ఉన్నవారు విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. సెక్యూరిటీల వద్ద యువకులు విధులు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు జరగవు’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment