ఓవర్‌ టేక్‌ చేయబోయి..  | Road Accident Car Hit Bridge 2 Died In Nandyal District | Sakshi
Sakshi News home page

 ఓవర్‌ టేక్‌ చేయబోయి.. 

Published Fri, Jun 17 2022 10:51 PM | Last Updated on Fri, Jun 17 2022 10:51 PM

Road Accident Car Hit Bridge 2 Died In Nandyal District - Sakshi

చిట్వేలి: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయిన కారు.. బ్రిడ్జిని ఢీకొనడంతో అందులోని తండ్రి, కుమారుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరావు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం.రాచపల్లి గ్రామానికి చెందిన పాండురాజు సుబ్బరామరాజు(64)కు ఆరోగ్యం బాగో లేకపోవడంతో రెండో కుమారుడు కుమార్‌రాజు (35), మూడో కుమారుడు హరికృష్ణరాజు (30) సోదరుడి కుమారుడు వాసు కృష్ణంరాజు (36) కలిసి కారులో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ్మరాజుపల్లె అడ్డువాగు వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో వీరి కారు బ్రిడ్జిని ఢీకొంది. ప్రమాదంలో సుబ్బరామరాజు, పి.కుమార్‌రాజు అక్కడికక్కడే మృతి చెందగా హరిక్రిష్ణమరాజు, వాసుక్రిష్ణమరాజు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు గ్యాస్‌ కట్టర్‌తో డోర్‌ను కట్‌ చేసి కుమార్‌రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ విషాద ఘటనతో రాచపల్లి గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. డ్రైవర్‌ పి.వాసుకృష్ణమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement