బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్టయిన శాండల్‌వుడ్ నటీమణి సంజనా గల్రానిని బుధవారం 10 గంటల సమయంలో సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయానికి తీసుకురాగా, మహిళా సీఐ అంజుమాల బృందం సంజనాను విచారించారు. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. నిందితుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో పాటు వివిధ కోణాల ద్వారా సేకరించిన వివరాలపై సంజనాను విచారించారు. 34 మంది పెద్ద పెద్ద వ్యక్తుల పుత్రుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలుసుకొంటున్నారు.
బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. మంగళూరు, యలహంక, కమ్మనహళ్లిలో జరిగిన హై–ఫై పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఆరా తీస్తున్నారు. సంజనా, రాగిణి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇతర నిందితులు వీరేన్ ఖన్నా, రాహుల్ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన పట్టుబట్టగా అధికారులు ఒప్పుకోలేదు. ( ఫోన్‌లో మెసేజ్‌లను తొలగించిన నటి )
సంజన కంట నీరు
నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాని కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. బెంగళూరు డైరీ సర్కిల్‌లోని మహిళా సాంత్వన కేంద్రంలో వీరిద్దరినీ ఉంచారు. మంగళవారం రాత్రి వీరికి ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిని కేటాయించారు. ఇద్దరి మధ్య మాటలు లేకుండా గడిపారు. ఆ చివర, ఈ చివర బెడ్లను ఇద్దరికీ కేటాయించగా, మధ్యలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. తనకు రాత్రి భోజనం వద్దని చెప్పిన సంజనా ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు తెలిసింది. రాగిణి, సంజనకు కేపీఎల్‌లో విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి మాటలు లేవు.
మహిళలే దొరికారా?
డ్రగ్స్ దందాలో రాగిణి, సంజనా పేర్లను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మరో నటీమణి పారూల్ యాదవ్ ఆక్రోశించారు. వారికి మద్దతుగా ఆమె గళమెత్తారు. దేశంలో డ్రగ్స్‌ను సేవిస్తున్నదీ, అమ్ముతున్నదీ ముగ్గురు (రియా చక్రవర్తి, రాగిణి, సంజనా) మాత్రమేనా, ఇంక ఎవరూ ఈ దందాలో లేరా? అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ సిబ్బంది, క్రీడాకారులు, నటులు డ్రగ్స్ వ్యవహారంలో లేరా? అని ఆమె సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment