బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన శాండల్‌వుడ్ అందాల తారామణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్‌ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను సీసీబీ పోలీసులు సేకరించారు. ఇందులో డ్రగ్స్ దందాతో అనేక మంది ప్రముఖులకు లింకులు ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. డ్రగ్స్ కేసు బయటపడగానే రాగిణి, సంజనలు వారి మొబైల్ ఫోన్‌లోని డేటాను మొత్తం డిలీట్ చేశారు. అందులో పార్టీల నిర్వహణ, డ్రగ్స్‌తో మజా చేస్తున్న వ్యక్తుల ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వారు జరిపే పార్టీల్లోకి డ్రగ్స్ తీసుకొనేవారిని మాత్రమే లోనికి అనుమతించేవారని సీసీబీ పోలీసులు చెబుతున్నారు. నిందితులు పార్టీల్లో కాకుండా, నివాసం ఉండే అపార్టుమెంట్లలో వాడే డ్రగ్స్ వేరేగా ఉండేవని తెలిసింది. దీంతో వారి ఫ్లాట్లలో మళ్లీ సోదాలు జరిపే అవకాశం ఏర్పడింది.
మళ్లీ కస్టడీ కోరతారా?
సోమవారం సాయంత్రంతో రాగిణి, సంజనల పోలీసు కస్టడీ ముగియనుంది. దీంతో వారిని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు మరింత కాలం కస్టడీ కోరతారా?, లేదా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. వారిద్దరూ బెయిలు అర్జీలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండుసార్లు కస్టడీకీ తీసుకుని ప్రశ్నించారు. ఇద్దరూ మహిళా సాంత్వన కేంద్రంలో ఎంతో దిగులుగా ఉంటున్నారు. ( సంజన ఫ్లాట్స్‌కు నటులు, సంగీత దర్శకులు )
సంజనపై డ్రగ్స్ సప్లై కేసు
నటి సంజన గల్రానిపై డ్రగ్స్ సేవించడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా పోలీసులు నమోదు చేశారు. సంజన తన వ్యాపార లావాదేవీలను ఎక్కువగా ఒకే సముదాయం చెందిన వ్యక్తులకు అప్పగించటంపై కూడా సీసీబీ దృష్టి సారించింది.
సీసీబీకీ పూర్తి అధికారం: హోంమంత్రి
డ్రగ్స్ కేసు దర్యాప్తుకు సీసీబీకి పూర్తి అధికారం అప్పగించిన్నట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అయన ఆదివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. సీసీబీకి సిబ్బంది కొరతను నివారించి వసతులను కల్పిస్తామని చెప్పారు. డ్రగ్స్‌తో యువత జీవనం నాశనం కాకూడదన్నారు.
ఎమ్మెల్యే జమీర్‌కు నోటీసు?
డ్రగ్స్ దందా కేసులో చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్‌కు నోటీసులు ఇవ్వాలని సీసీబీ నిర్ణయించింది. జమీర్ అహ్మద్, నటి సంజనలు శ్రీలంకలో క్యాసినోలో పాల్గొన్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఆరోపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సంబరగి నుంచి సీసీబీ సమాచారాన్ని సేకరించింది. జమీర్ అహ్మద్‌ను కూడా ప్రశ్నించవచ్చని తెలిసింది. ( డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం )
కొలంబో క్యాసినోకు తారల ప్రచారం
శ్రీలంకలో క్యాసినో జూదాల్లో పాల్గొనడం గురించి నటీనటులు బహిరంగ ప్రచారం చేసిన వ్యాపార ప్రకటనలు బయటపడుతున్నాయి. క్యాసినోకు మేం వెళ్లాం, మీరూ వెళ్లండి అని ఐంద్రితారై, కాజల్, బిపాసా బసు, ఊర్వశి రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోను సూద్ తదితర అనేకమంది నటీనటులు పాల్గొన్న ప్రకటన అది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన షేక్ ఫాసీల్‌కు వీరు ధన్యావాదాలు చెప్పడం గమనార్హం. వివిధ బాషలకు చెందిన నటీనటులను డ్రగ్స్ నిందితులు కావలసిన నజరానాలు ఇచ్చి క్యాసినోకు తీసుకెళ్లినట్లు సీసీబీకీ బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. దీంతో మరికొందరు నటీనటులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment