సాక్షి, హైదరాబాద్: మార్కెట్‌లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
ఆన్‌లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్‌సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్‌లైన్‌లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు.
ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్‌లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్‌సైట్‌లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది.
ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్‌లైన్‌లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్‌సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment