గ్యాంగ్‌టాక్: మంచుసోయగాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు వచ్చిన పర్యాటకులను ప్రకృతి హిమపాతం రూపంలో కబళించింది. సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూలా ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్‌టాక్, నాథూ లాను కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్ మైలురాయి వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వద్దన్నా వినకుండా..
ప్రమాదం విషయం తెలియగానే సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌ఓ) సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానికులు అక్కడికి చేరుకుని 23 మందిని కాపాడారు. నెహ్రూ మార్గ్‌లో ఆగిపోయిన 80 వాహనాల్లోని 350 మందికిపైగా పర్యాటకులను సురక్షితంగా వెనక్కి పంపించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా 13వ నంబర్ మైలురాయి దాటాక సాధారణంగా పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, పర్యాటకులు ఘటనాస్థలి దాకా తీసుకెళ్లాలని టూర్ ఆపరేటర్లు, డ్రైవర్లను బలవంతపెట్టారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. చైనా సరిహద్దు సమీపంలో నాథూ లా మార్గముంది. వాణిజ్య సంబంధ రాకపోకలకు భారత్, చైనాలు వినియోగిస్తున్న మూడు సరిహద్దు పోస్ట్‌లలో నాథూ లా ఒకటి. సముద్రమట్టానికి 14,450 అడుగుల ఎత్తులోని మంచుమయమైన ఈ ప్రాంతాలను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం తెల్సిందే. గ్యాంగ్‌టాక్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. ప్రమాదం జరిగాక క్షతగాత్రులను గ్యాంగ్‌టాక్‌కు పంపించి చికిత్సనందిస్తున్నారు.
చదవండి: విషాదం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరిచిన పారిశుద్ధ్య కార్మికులు.. కాసేపటికే..
Comments
Please login to add a commentAdd a comment