సాక్షి, జియాగూడ: కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 28న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యం తాగి తరచూ వేధిస్తుండటంతో అక్క, బావ కలిసి అతడిని కడతేర్చినట్టు తేల్చారు. ఇన్‌స్పెక్టర్ శంకర్, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ పుకట్‌నగర్‌కు చెందిన పెయింటర్ దినేష్‌సింగ్ (26), అతని సోదరుడు భరత్‌సింగ్ తిరుపతిలో పెయింటింగ్ పని చేసేవారు. వీరి అక్కాబావ నీతు, సూర్యప్రకాష్‌లు వెంకటేష్‌నగర్‌లో ఉంటున్నారు. ఇది లా ఉండగా లాక్‌డౌన్ నేపథ్యంలో నగరానికి వచ్చేసిన దినేశ్, భరత్‌సింగ్‌లు తరచూ మద్యం తాగి అక్క ఇంటికి వెళ్లి ఆమె వద్ద తాము దాచుకున్న డబ్బులు కోసం గొడవపడేవారు. ఎప్పటిలాగే గతనెల 28న రాత్రి ఇరువురూ మద్యం సేవించి అక్క ఇంటికి వెళ్లారు. తిరుపతి వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగారు.
సరేనన్న అక్క,బావలు రూ.100 ఇవ్వడంతో మళ్లీ మద్యం తాగారు. దినేశ్ అక్క ఇంట్లో పడుకోగా భరత్‌సింగ్ వెళ్లిపోయాడు. ఎప్పటినుంచో విసిగిపోయి ఉన్న అక్క, బావ కలిసి నిద్రపోతున్న దినేశ్ ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి పెట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. అర్ధరాత్రి ప్రాంతంలో ద్విచక్రవాహనంపై దినేశ్ మృతదేహాన్ని పురానాపూల్, ఇక్బాల్‌గంజ్ మీదుగా కల్లుకంపౌండ్ వద్దకు తీసుకెళ్లి దాని వెనుక భాగంలో పడేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు హతు డు అక్కాబావలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. సోమవారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment