సాక్షి, హైదరాబాద్: ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన గీతం సమాజంలో నానాటికీ అడుగంటుతున్న మానవవతా విలువలకు అద్దం పడుతుంది. ఆదివారం జియాగూడలో జరిగిన దారుణ ఉదంతాన్ని కళ్లకు కడుతుంది. పురానాపూల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అంబర్‌పేట వాసి జంగం సాయినాథ్‌ను అడ్డగించిన ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు.
పట్టపగలు, నడిరోడ్డుపై నరికి చంపుతున్నా స్థానికులు చూస్తూ ఊర్కుకున్నారే తప్ప అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. జరుగుతున్న ఘోరాన్ని అనేక మంది వీడియో చిత్రీకరించి వైరల్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు అనేక చోటు చేసుకున్నాయి. మనుషుల్లో పెరిగిపోతున్న ఈ ధోరణికి కారణాలపై ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రొఫెసర్ డాక్టర్ అనిత రాయిరాలను ‘సాక్షి’ అభిప్రాయం కోరగా.. సమాజంలో ఈ పరిస్థితులు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. తాజా పరిస్థితులపై డాక్టర్ అనిత తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు.
సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికే...
► కళ్లెదుటే జరుగుతున్న ఘోరాన్ని ఆపడానికి బదులు దాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించే ధోరణి పెరిగిపోయింది. ఆ వీడియో వైరల్ కావడం వల్ల వచ్చే కిక్, ఆ సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికి కొందరు ఇలా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్స్, కామెంట్స్, ఫార్వర్డ్స్‌లో తమ సక్సెస్ వెతుక్కునే వాళ్లు పెరిగిపోయారు. స్మార్ట్ ఫోన్ సామాన్యుడి చేతికి రావడంతో ఈ మీడియా పరిధి పెరిగిపోవడం, ఇందులోని అంశాలు వేగంగా విస్తరించడం తదితర కారణాలతో తమ వీడియో వైరల్ కావడం ఓ కిక్‌గా భావిస్తున్నారు. కొన్నింటిని వైరల్ చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.
► సోషల్‌మీడియాలో ట్రోలర్స్ ఎవరనేది ఎదుటి వారికి తెలీదు. దీంతో వాళ్లు చేసే కామెంట్స్, పోస్టులు నేరుగా వీళ్లపై ప్రభావం చూపదు. ఈ కారణంగానూ ఘోరాలను వీడియో తీసి వైరల్ చేయడం అనే ధోరణి పెరిగిపోయింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ మార్కులు, ర్యాంకుల ఆధారితంగా మారిపోయింది. ఈ పరిస్థితులు మారాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు ఆ కోణంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతలు, విలువలు విద్యలో భాగంగా మారాలి. ప్రతి వ్యక్తి జీవితంలో రోల్ మోడల్స్‌ను ఎంచుకునే విధానం మారాలి. అలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ఫలితాలు ఉంటాయి.
హీరోయిజానికి అర్థం మారిపోయింది..
► ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, వాటి విలువలు తగ్గాయి. మనుషులను బట్టే సమాజం కూడా ఉంటుంది. అనేక మంది ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోవడంతో ఎదుటి వారికి సహాయం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. గతంలో వీరికి సహాయం అవసరమైనప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడమూ ఈ ధోరణికి ఓ కారణమే.
► సినిమాలు, మీడియా తదితరాలను కూడా సక్సెస్ అంటే ఉన్నత స్థితికి చేరడం, డబ్బు సంపాదించడం అంటూ.. హీరోయిజమంటే ఎదుటి వారిని కొట్టడం అన్నట్లు చూపిస్తున్నాయి. ఇలాంటి వారికి లభిస్తున్న ప్రచారం పది మందికి సహాయపడిన, పడుతున్న వారికి లభించట్లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా మానవ సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోవడానికి కారణమైంది. వీటితో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న నేరాలు చూడటం అలవాటుపడిన వాళ్లు తమ కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా స్పందించట్లేదు.
-ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రొఫెసర్ అనిత
Comments
Please login to add a commentAdd a comment