
తల్లి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న కుమార్తెలు (ఇన్‌సెట్) సుభాషిణి
కేవీబీపురం: అనుమానంతో భార్యను కిరాతంగా కత్తితో గొంతుకోసి హతమార్చిన సంఘటన కేవీబీపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పుత్తూరు రూరల్ సీఐ ఈశ్వర్ తెలిపిన వివరాల మేరకు.. కేవీబీ పురానికి చెందిన సూరిబాబు, సుభాషిణి (32) పద్నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి యామిని(14), దేవిక(12), గాయత్రి (10) కుమార్తెలు ఉన్నారు. సూరిబాబు టైలర్ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న అతను తరచూ గొడవపడి వేధించేవాడు.
పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా అతని ప్రవర్తన మారలేదు. ఈ క్రమంలో మంగళవారం కిరాణాషాపుకు వెళ్లి తిరిగి వస్తున్న సుభాషిణిని వెంబడించి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం కేవీబీపురం పోలీసులకు లొంగిపోయాడు. సీఐ ఈశ్వర్, ఎస్‌ఐ హరినాథ్, పిచ్చాటూరు ఎస్‌ఐ దస్తగిరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుభాషిణి తండ్రి సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు సీఐ తెలిపారు.
మానాన్నను ఉరి తీయండి..
తల్లిని హతమార్చిన తమ తండ్రిని తక్షణం ఉరితీయాలని కోరుతూ వారి ముగ్గురు కుమార్తెలు పోలీసుల ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు సూరిబాబును తమకు అప్పగించాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment