టట్లుబాజీ గ్యాంగ్: కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లు | Tatlu Bazi Gang Robberies Increased In Hyderabad | Sakshi
Sakshi News home page

టట్లుబాజీ గ్యాంగ్: కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లు

Published Mon, Nov 16 2020 9:03 AM | Last Updated on Mon, Nov 16 2020 9:03 AM

Tatlu Bazi Gang Robberies Increased In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దృష్టి మళ్ళించడంతోపాటు నకిలీ బంగారం అంటగట్టడంతో పాటు ఎరవేసి కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్ళకు పాల్పడే టట్లుబాజీ గ్యాంగ్‌ ఏమాత్రం తగ్గట్లేదు. ఓపక్క పోలీసులు వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నా... రకరకాలుగా నేరాలకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా నగరానికి చెందిన జ్యువెలరీ వ్యాపారి పవన్‌ నాయుడిని మహారాష్ట్రకు పిలిపించిన ఈ నేరగాళ్ళు ఆయనకు నకిలీ బంగారం అంటగట్టి రూ.39 లక్షలు స్వాహా చేశారు. పాల్గర్‌ జిల్లా విక్రమ్‌గఢ్‌లో జరిగిన ఈ ఉదంతంపై నమోదైన కేసు దర్యాప్తు చేసిన అంథేరీ ఎంఐడీసీ పోలీసులు మహ్మద్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు టట్లుబాజీ గ్యాంగ్‌ సభ్యుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌ సహా అనేక నగరాలకు చెందిన వారు ఈ తరహాలో మోసపోతున్నారని, తమ వద్దకు తరచు ఇలాంటి కేసులు వస్తున్నాయని అంథేరీ ఎంఐడీసీ పోలీసులు చెప్తున్నారు.  

  • రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని మేవాట్‌ రీజియన్‌గా పరిగణిస్తారు. ఇందులో ఉన్న 35 గ్రామాల్లో వందల మంది నేరచరితులే ఉన్నారు. నకిలీ బంగారం పేరుతో మోసాలు చేసే, కిడ్నాప్‌లకు పాల్పడే ముఠాలు ఆ ప్రాంతానికి చెందినవి 25 వరకు దేశవాప్తంగా పని చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబైతో పాటు పాల్ఘర్‌ జిల్లా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి అడ్డాలు ఉన్నాయి.  
  • పుత్తడితో చేసి, బంగారం కోటింగ్‌ ఉన్న ఇటుకల్ని చూపించి పసిడివిగా నమ్మించి మోసం చేయడం వీరి ప్రధాన నైజం. ఈ ఇటుకల్ని ‘టట్లు’ అని పిలుస్తారు. మోసాలకు పాల్పడే దందాను ‘బాజీ’ అంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ముఠాకు టట్లుబాజీ గ్యాంగ్‌ అనే పేరు వచ్చింది. 2010 నుంచి నేరాలు చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా తొలినాళ్ళల్లో కేవలం నకిలీ బంగారం దందా మాత్రమే చేసేది. తాజాగా వ్యాపారులకు ఎరవేసి, తమ ప్రాంతాలకు రప్పించడం ద్వారా కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయడం కూడా మొదలెట్టింది.  
  • ఈ ముఠా తొలినాళ్ళల్లో చేసిన ‘బంగారం ఫ్రాడ్‌’లోనే తమదైన పంథా అనుసరించింది. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ వ్యాపారుల్ని తమ ప్రాంతాలకు తీసుకువెళ్తుంది. అప్పటికే ఈ ముఠా సభ్యుడు చిన్నటి బంగారం ముక్కను తన నోట్లో సిద్ధంగా ఉంచుకుంటాడు. వ్యాపారి వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న చిన్న బంగారపు ఇటుకలా ఉన్న దాంట్లోంచి ఓ ముక్కను తీస్తాడు. వ్యాపారి దృష్టి మళ్ళించడం ద్వారా దీనికి బదులు  అసలు బంగారం ముక్కను అతడికి ఇస్తాడు. అలా తన చేతికి వచ్చిన దాన్ని పరీక్షించే వ్యాపారి అది మేలిమి బంగారంగా తేలడంతో నగదు ఇచ్చి ఇటుక తీసుకువచ్చేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే తాను మోసపోయాననే విషయం గుర్తిస్తాడు. వీళ్ళు గతంలో నగరానికి చెందిన అంజద్‌ ఖాన్‌ రూ.4 లక్షలు, ఆయేషా కరీమా రూ.2 లక్షలకు మోసం చేశారు. అప్పట్లో వీటిపై అఫ్జల్‌గంజ్, గోల్కొండ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.  
  • దేశ వ్యాప్తంగా నేరాలు చేసే ఈ ముఠాలు తమ పంథా మార్చాయి. టట్లుబాజీ గ్యాంగ్స్‌ జస్ట్‌ డయల్‌ ద్వారా లభించిన వ్యాపారుల నెంబర్ల ఆధారంగా వారికి ఎర వేసి తమ ప్రాంతాలకు లేదా అడ్డాలుగా మార్చుకున్న చోట్లకు రప్పించుకోవడం ప్రారంభించాయి. అలా వచ్చిన వారికి సమీపంలో ఉన్న నిర్మానుష్య, అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్ళి వారి నుంచి డబ్బు లాక్కుని నకిలీ బంగారం ఇచ్చి పారిపోతున్నాయి. తాజాగా నగరానికి చెందిన జ్యువెలరీ వ్యాపారి పవన్‌ నాయుడిని మహారాష్ట్రకు పిలిపించిన ఈ నేరగాళ్ళు ఆయనకు నకిలీ బంగారం అంటగట్టి రూ.39 లక్షలు స్వాహా చేశారు. కొన్ని సందర్భాల్లో ఇలా వెళ్ళిన వ్యాపారుల్ని, కిడ్నాప్స్‌ చేసి బెదిరింపు వసూళ్ళు పాల్పడుతుంటాయి.  
  • బాధితుడిని ఓ ప్రాంతంలో బంధించడంతో పాటు తుపాకీ గురి పెట్టిన ఫొటోలు తీస్తుంది. వీటిని బాధితుడి సెల్‌ఫోన్‌ నుంచే అతడి కుటుంబీకులకు వాట్సాప్‌ ద్వారా పంపిస్తుంది. తక్షణం తాము కోరిన మొత్తం బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయకపోతే తమ వద్ద ఉన్న వాడిని చంపేస్తామంటూ బెదిరిస్తుంది. బాధితుడి తరఫు వారు డిపాజిట్‌ చేసిన వెంటనే డ్రా చేసుకుని బందీని విడిచిపెడుతుంది. గతంలో ఏఎస్‌రావ్‌ నగర్‌కు చెందిన శామ్యూల్‌ విల్సన్, నవీన్‌కుమార్‌ నుంచి వారి వద్ద ఉన్న రూ.30 వేలు దోచుకోవడంతో పాటు కుటుంబాన్ని బెదిరించి రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నారు. అలాగే రామ్‌నగర్‌కు చెందిన అంజయ్యను కిడ్నాప్‌ చేసి రూ.30 వేలు దోచుకుని మరో రూ.1.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నారు.  

అపరిచితులతో లావాదేవీలు వద్దు 
టట్లుబాజీ గ్యాంగ్స్‌ చేతిలో అనేక మంది వ్యాపారులు మోసపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కేసులు ఉన్నాయి. ఇటీవల కాలంలో అనేక మంది బాధితులను ముంబైలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు రప్పిస్తున్నారు. కొందరికి నకిలీ బంగారం అప్పగించి మోసం చేస్తుండగా... మరికొందరికి కిడ్నాప్‌ చేసి వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఎవరైనా సరే అపరిచితులు కేవలం ఫోన్‌ ద్వారా పరిచయమైన వారితో లావాదేవీలు చేయకూడదు. బంగారం ఎలక్టాన్రిక్‌ వస్తువులు మార్కెట్‌ ధరకంటే తక్కువకు ఇస్తున్నామంటే అనుమానించాలి. ఎక్కడో మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు చెందిన వాళ్ళు అక్కడి వారికి కాకుండా మనకే ఎందుకు ఇస్తామంటున్నారు? అనేది అనుమానించాలి. ఇలాంటి వారి చేతిలో పడితే కొన్నిసార్లు హత్యలు వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.  – రాహుల్‌ ఆస్తానా, పోలీసు ఇన్‌స్పెక్టర్, ముంబై పోలీస్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement