టీడీపీ నేతలను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు
కుప్పం: ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. విచక్షణారహితంగా దాడులు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బుధవారం రామకుప్పం మండలం, కొల్లుపల్లిలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను దౌర్జన్యంగా తొలగించారు.
ఇది సరికాదంటూ అడ్డువచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రగాయాలతో.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గురువారం సైతం కుప్పం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యంగా తొలగిస్తుండగా.. పోలీసులు అడ్డుకోబోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయి.. పోలీసులపై సైతం దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రామకుప్పం పోలీసుస్టేషన్ పరిధిలో 5, కుప్పం పరిధిలో 3 కేసులు నమోదయ్యాయి.
నిందితులైన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులుతో పాటు 59 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ గంగయ్య, సీఐలు శ్రీధర్, సూర్యమోహన్‌రావు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment