దోపిడీలో స్కిల్‌.. బాబు గ్యాంగ్‌ హల్‌'షెల్‌' | TDP Scam In The Name Of APSSDC Funds With Shell Company | Sakshi
Sakshi News home page

దోపిడీలో స్కిల్‌.. బాబు గ్యాంగ్‌ హల్‌'షెల్‌'

Published Sat, Dec 11 2021 2:56 AM | Last Updated on Sat, Dec 11 2021 9:28 AM

TDP Scam In The Name Of APSSDC Funds With Shell Company - Sakshi

రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో తనిఖీల సమయంలో అక్కడే ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

అధికారం అండగా గత ప్రభుత్వ పెద్దలు సాగించిన దోపిడీ పర్వంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ అంటూ ‘షెల్‌ కంపెనీ’లతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. తూతూ మంత్రంగా ఒప్పందం చేసుకుని పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. ఆ విధంగా రూ.241 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ కుంభకోణంపై 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పందించక పోగా, సంబంధిత ఫైళ్లను మాయం చేసింది. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్‌ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులను ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అడ్డుకోడానికి ప్రయత్నించడం విస్మయ పరిచింది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా వీరు అడ్డుకోవడానికి యత్నించడం చూస్తుంటే ఈ కుంభకోణంలో టీడీపీ పెద్దలు కీలకంగా వ్యవహరించారన్నది స్పష్టమైంది. 

సీఐడీ విస్తృత తనిఖీలు, నోటీసులు
‘ఏపీఎస్‌ఎస్‌డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్‌ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

విజయవాడలో ఈ నెల 13న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ, ముంబాయి, పూణే తదితర నగరాల్లోని కంపెనీలు, షెల్‌ కంపెనీలలో కూడా తనిఖీలు నిర్వహించారు.  
సీఐడీ సోదాల సమయంలో లోబీపీతో పడిపోయిన లక్ష్మీనారాయణ. 

హడావుడి జీవో.. అందుకు విరుద్ధంగా ఒప్పందం
2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్‌ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది.

కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు మొత్తం కథ నడిపించారు. కేవలం రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదు. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ లేదు. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. 
 వైద్యం కోసం వస్తున్న డాక్టర్లు 

పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపు
జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదు. 

షెల్‌ కంపెనీల ద్వారా బాబు అస్మదీయులకు
రూ.371 కోట్లను అడ్డగోలుగా కొల్లగొట్టడానికి అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు ‘షెల్‌ కంపెనీల’ను ముందే సృష్టించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా ‘స్కిల్లర్‌’ అనే షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీకి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సరఫరా కోసం రూ.241 కోట్లకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించారు. ఆ ‘స్కిల్లర్‌’ కంపెనీ ముంబయిలోని ‘అలైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ (ఏఐసీ) అనే మరో షెల్‌ కంపెనీకి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టుగా కనికట్టు చేశారు. ఆ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీకి సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించింది. ఢిల్లీకి చెందిన పాట్రిక్స్‌ ఇన్ఫో సర్వీసెస్, ఇన్‌వెబ్‌ ఇన్ఫో సర్వీసెస్, అరిహంట్‌ ట్రేడర్స్, జీఏ సేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే షెల్‌ కంపెనీలు తెరపైకి వచ్చాయి.

ఒక్కో ఇన్‌వాయిస్‌కు 5 శాతం కమిషన్‌ చొప్పున దాదాపు 50 నకిలీ ఇన్‌వాయిస్‌లను సమర్పించింది. ఆ నకిలీ ఇన్‌వాయిస్‌ల ఆధారంగా రూ.241 కోట్లు ఏసీఐకి చెల్లించారు. దాన్నుంచి ఏసీఐ కంపెనీ తన 5 శాతం కమిషన్‌ను తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెల్లించింది. అంటే పనులు చేయకుండానే ప్రభుత్వం చెల్లించిన మొత్తం రెండు షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి వచ్చి చేరింది. ఆ విధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను పక్కా పన్నాగంతో కొల్లగొట్టారు. 

ఇలా గుట్టు రట్టు.. నోట్‌ ఫైళ్లు మాయం 
2018లో పూణేలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న పలు కంపెనీలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు 220 షెల్‌ కంపెనీల గుట్టు రట్టు చేశారు. వాటిలో ఏపీఎస్‌ఎస్‌డీసీ పనులను సబ్‌ కాంట్రాక్టుకు తీసుకున్నట్టు చూపించిన స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. ఆ కంపెనీల ప్రతినిధులను జీఎస్టీ అధికారులు విచారించగా.. తాము ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఎలాంటి సాఫ్ట్‌వేర్‌గానీ హార్డ్‌వేర్‌గానీ సరఫరా చేయలేదని తెలిపారు.

డిజైన్‌ టెక్‌ కంపెనీకి తాము షెల్‌ కంపెనీగా వ్యవహరించామని అంగీకరించారు. జీఎస్టీ అధికారులు ఈ విషయాన్ని తెలిపినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోలేదు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీలో పాత్రధారులు జాగ్రత్తపడ్డారు. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో కాంట్రాక్టుకు సమ్మతించిన జీవో 4కు సంబంధించిన నోట్‌ ఫైళ్లను సచివాలయంలో మాయం చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీలో కూడా సంబంధిత ఫైళ్లు గల్లంతు కావడం గమనార్హం. 

అక్కడా, ఇక్కడా ఆయనే..
అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు కొల్లగొట్టడంలో అన్నీ తామై వ్యవహరించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు అదే సమయంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అప్పటి సీఎం చంద్రబాబుకు ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా వ్యవహరించారు. అంటే ఆయనే ప్రతిపాదిస్తారు.. ఆయనే ఆమోదిస్తారు.. సీఎంవోను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. దీనికి ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీ నారాయణ అన్ని విధాల సహకరిస్తారు. తదనంతరం వచ్చిన ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీలు కూడా ఈ అడ్డగోలు వ్యవహారం గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండటం విస్మయపరుస్తోంది. 

అరెస్టులకు రంగం సిద్ధం 
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అవినీతి బాగోతంలో కీలకంగా వ్యవహరించిన షెల్‌ కంపెనీల ప్రతినిధులు కొందరిని ఇతర రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని వారిని రాష్ట్రానికి తీసుకురానున్నారు. వారి నుంచి మరిన్ని వాస్తవాలను రాబట్టి ఈ కేసులో సూత్రధారుల అవినీతి బండారాన్ని నిరూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి 
2014–19 మధ్య కాలంలో ఏపీఎస్‌ఎస్‌డీసీలో నిధులు దారి మళ్లినట్టు మేము గుర్తించాం. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించగా నిధులు దారిమళ్లిన విషయం నిర్ధారణ అయ్యింది. దాంతో మేము ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసు సీఐడీకి అప్పగించింది. పూర్తి స్థాయిలో విచారించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– అజయ్‌ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్‌ఎస్‌డీసీ

హల్‌చల్‌ చేసిన రాధాకృష్ణ, పయ్యావుల
– సీఐడీ అధికారుల తనఖీలను అడ్డుకునేందుకు యత్నం
– దీటుగా బదులిచ్చిన సీఐడీ అధికారులు
సాక్షి, హైదరాబాద్‌ : ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్‌మాల్‌ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో పలువురు నిందితుల ఇళ్లల్లో ఏపీ సీఐడీ అధికారుల తనిఖీల సందర్భంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ హల్‌ చల్‌ చేశారు. ఏకంగా సీఐడీ అధికారులను అడ్డుకునేందుకు వారు యత్నించడం విస్మయ పరిచింది. తమ విధులు నిర్వహించకుండా రాధాకృష్ణ అడ్డుకోవడంపై సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు నిందితుడు లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ అక్కడే ఉండటం గమనార్హం.

విధి నిర్వహణలో ఉన్న సీఐడీ అధికారులను అడ్డుకోవడంతోపాటు ఏబీఎన్‌  చానల్‌ కెమెరామెన్‌లతో తనిఖీలను వీడియో తీయించడం వివాదాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారులను బెదిరింపులకు గురిచేసేలా ప్రవర్తించిన రాధాకృష్ణ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. రాధాకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కూడా లక్ష్మీనారాయణ నివాసానికి కార్యకర్తలతో వచ్చి హడావుడి చేశారు. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు ఎలా చేస్తారని రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించగా సీఐడీ అధికారులు దీటుగా బదులిచ్చారు.

ఎఫ్‌ఐఆర్‌తో పాటు సోదాలకు సంబంధించిన ప్రోసీడింగ్‌ కాపీని జూబ్లీ హిల్స్‌ పోలీసులకు ఒక రోజు ముందే అందించామన్నారు. దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పందించి తనిఖీల సమయంలో తమకు సహకరిస్తున్న విషయాన్ని తెలిపారు. దాంతో వేమూరి రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్‌ మౌనంగా ఉండిపోయారు. సోదాలు నిర్వహించే సమయంలో స్వల్ప అస్వస్థత ఉందని లక్ష్మీనారాయణ చెప్పడంతో పోలీసులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

గంటా సుబ్బారావు ఇంట్లో సీఐడీ సోదాలు
షాబాద్‌: ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్‌మాల్‌ కేసుకు సంబంధించి నిందితుడైన గంటా సుబ్బారావు ఇంట్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆయన 34 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement