‘పుష్ప’ను ఫాలో అయ్యి.. పరారయ్యారు!  | Transportation of marijuana in an oil tanker police Seizure of marijuana | Sakshi
Sakshi News home page

‘పుష్ప’ను ఫాలో అయ్యి.. పరారయ్యారు! 

Published Mon, Feb 7 2022 3:30 AM | Last Updated on Mon, Feb 7 2022 8:16 AM

Transportation of marijuana in an oil tanker police Seizure of marijuana - Sakshi

పట్టుబడిన గంజాయి ప్యాకెట్లు

శృంగవరపుకోట/నర్సీపట్నం: ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేస్తారు. ఈ ఐడియా ఏదో మనకు పనికొస్తుంది అనుకున్నారో ఏమో.. ఆ గంజాయి స్మగ్లర్లు అచ్చం అదే ఐడియాను అనుసరించారు. ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయి రవాణా చేస్తూ విజయనగరం జిల్లా ఎస్‌.కోట పోలీసులకు దొరికిపోయారు. అరకు నుంచి ఎస్‌.కోట వైపు వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం ఆదివారం ఎస్‌.కోట ఎస్‌ఐ తారకేశ్వరరావుకు అందింది. దీంతో తన సిబ్బందితో కలిసి బొడ్డవర చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

తొలుత తమ లారీలో ఎలాంటి గంజాయి లేదని డ్రైవర్, క్లీనర్లు బుకాయించారు. పోలీసులు ట్యాంకర్‌ పైకి ఎక్కి నాలుగు కంపార్ట్‌మెంట్లపై క్యాప్‌లకు ఉన్న నట్లు తీసేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి ఉడాయించారు. ట్యాంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నాలుగు కంపార్ట్‌మెంట్ల క్యాప్‌లు తెరచి చూడగా.. ముందున్న కంపార్ట్‌మెంట్, వెనుక ఉన్న రెండు కంపార్ట్‌మెంట్లను ఖాళీగా వదిలేశారు. మధ్యలోని రెండో కంపార్ట్‌మెంట్లో లోడ్‌ చేసిన 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.   

నర్సీపట్నంలో రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం  
లారీలో తరలిస్తున్న 1100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ రమేష్‌ తన సిబ్బందితో కలిసి చింతపల్లి రోడ్డు నెల్లిమెట్ట వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన డ్రైవర్‌ కొద్ది దూరంలో లారీ ఆపి పారిపోయాడు. లారీని పోలీసులు తనిఖీ చేయగా  సుమారు రూ.3 లక్షల విలువైన గంజాయి బయటపడింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement