
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఫేక్ వీడియోలు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఫేక్ వీడియోలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అదనపు డీజీపీ జితేందర్‌కు సుమన్ నేతృత్వంలో ఆరూరి రమేశ్, క్రాంతికిరణ్, మెతుకు ఆనంద్‌తో కూడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం ఫిర్యాదు చేసింది.
అనంతరం సుమన్ మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా కుటుంబాలున్నాయని, బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుపైనా ఫేక్ వీడియోలు సృష్టించారని, దళిత నేతల ఎదుగుదలను బీజేపీ ఓర్చుకోవడం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్ర చారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని సంజయ్, ఈటల సహా ఎవర్నీ వదలబోమని సుమన్ హెచ్చరించారు.