సాక్షి, ఖమ్మం: జిల్లాలో వివాహిత నవ్యా రెడ్డి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే మరో యువతి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎర్రుపాలెం మండలం పగిళ్ల పాడుకు చెందిన వెనీలా అనే యువతి శుక్రవారం పగిళ్లపాడు-తొండలగోపవరం గ్రామాల మధ్యలో రైలు కింద పడి ఆత్యహత్య చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరణించిన వెనీలా.. నవ్యా రెడ్డి భర్త నాగశేషు రెడ్డికి బంధువేకాక ఇద్దరు ఒకే ఊరికి చెందిన వారు కావడం గమనార్హం. నవ్య హత్య గురించి దర్యాప్తు కొనసాగుతుండగానే వెనీలా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి నవ్యా రెడ్డి హత్య
భార్యను హత్య చేసిన నాగశేషు రెడ్డి.. ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు సీసీ కెమరాలను పరిశీలించారు. దాంట్లో భార్యాభర్తలిద్దరు ఈ నెల 2న బైక్‌పై వెళ్లడం రికార్డయ్యింది. అనుమానం వచ్చిన పోలీసులు నాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే భార్యను చంపినట్లు అంగీకరించాడు. ఈ నెల 2న నవ్యకు జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి.. కుక్కల గుంటలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లానని తెలిపాడు.
ఇక అప్పటికే స్పృహ కోల్పోయిన నవ్యను ఆమె చున్నీకే ఉరి వేశానని వెల్లడించాడు. ఆ తర్వాత నవ్య మొబైల్ నుంచి ఆమె తండ్రికి బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పంపినట్లు వెల్లడించాడు. ఇక దర్యాప్తులో నాగశేషుకు వేరే యువతీతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలో వెనీలా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment