నగరి(చిత్తూరు జిల్లా): మునిసిపల్ పరిధి, సత్రవాడ దళితవాడకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. సీఐ మద్దయ్య ఆచారి కథనం మేరకు.. దళితవాడు చెందిన సుధాకర్ (25), దళపతి (25) రోజు వారి కూలీలు. బుధవారం రాత్రి అడవికొత్తూరు దళితవాడలో జరిగిన వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో భారీ వర్షం వచ్చింది. తలదాచుకోవడానికి అక్కడే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లారు.
అప్పటికే వర్షానికి షెడ్డు పక్కనే ఉన్న స్టే వైరులో విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ తీగ తగలడంతో షాక్‌కు గురయ్యారు. కొంతసేపటి తర్వాత వారు అక్కడే పడిపోయారు. గుర్తించిన స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుధాకర్‌కు భార్య, నలుగురు కుమారులు, దళపతికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది.
ఎలా బతికేది..?
రోజూ కూలికెళ్లినా మహరాజుల్లాగా చూసుకున్నారు. కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఆదుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఇబ్బందీ లేకుండా తోడుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఇక మాకు దిక్కెవరు దేవుడా.. అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విగత జీవులుగా పడి ఉన్న తండ్రులను చూసి పిల్లల మనసు చలించి పోయింది. ఇక మేమెలా బతికేది నాయనా..? అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment