సినీ ఫక్కిలో.. లవర్‌ కోసం భర్త కిడ్నాప్‌ | Using Fake COVID Report Abducts Man in Ambulance in Bengaluru | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 5 2020 8:52 PM | Last Updated on Sun, Dec 6 2020 4:20 AM

Using Fake COVID Report Abducts Man in Ambulance in Bengaluru - Sakshi

బెంగళూరు: లవర్‌కి సాయం చేయడం కోసం ఓ మహిళ భర్తను కిడ్నాప్‌ చేసింది. పూర్తిగా సినీ ఫక్కిలో జరిగిన ఈ కిడ్నాప్‌ వ్యవహారం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన సోమశేఖర్‌ అనే వ్యక్తి ఇల్లు కొనడం కోసం సుమారు 40 లక్షల రూపాయలు దాచాడు. ఈ డబ్బుపై అతడి భార్య కన్నుపడింది. ఈ మొత్తం తీసుకుని ప్రియుడికిచ్చి.. అతడితోపాటు ఉడాయించాలని భావించింది. ఈ క్రమంలో లవర్‌, అతడి తల్లి.. స్థానిక బీబీఎంపీ డాక్టర్‌తో కలిసి భర్త కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసింది. దాని ప్రకారం ముందుగా బీబీఎంపీ డాక్టర్‌ సాయంతో భర్త సోమశేఖర్‌ పేరు మీద ఓ నకిలీ కోవిడ్‌-19 పాజిటివ్‌ సర్టిఫికెట్‌ తెప్పించింది. ఆ తర్వాత ఓ రోజు తనకు కడుపు నొప్పిగా ఉంది.. టాబ్లెట్స్‌ తీసుకురావాల్సిందిగా భర్త సోమశేఖర్‌ని కోరింది. దాంతో అతడు సమీప మెడికల్‌ షాప్‌కు వెళ్లాడు. అప్పటికే ఓ అంబులెన్స్‌లో రెడీగా ఉన్న బాధితుడి భార్య లవర్‌, అతడి తల్లి, బీబీఎంపీ డాక్టర్‌ మెడికల్‌ షాపు దగ్గరికి వచ్చారు. సోమశేఖర్‌కి కరోనా పాజిటివ్‌ అని.. ఆస్పత్రి నుంచి తప్పించుకుని వచ్చాడని అరిచారు. దాంతో స్థానికులు సోమశేఖర్‌ని పట్టుకుని బలవంతంగా అంబులెన్స్‌లోకి తోశారు. (చదవండి: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం)

ఆ తర్వాత సోమశేఖర్‌ని తీసుకుని వెళ్లి ఓ ఫామ్‌హౌజ్‌లో బంధించారు. నలభై లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని తెలిపారు. దాంతో సోమశేఖర్‌కి అనుమానం వచ్చింది. ఇది తెలిసిన వారి పనే అని భావించి ఎలాగైనా కిడ్నాపర్ల చెర నుంచి బయట పడాలని నిర్ణయించుకున్నాడు. సరే డబ్బు ఇస్తానని చెప్పి తన స్నేహితులకు కాల్‌ చేశాడు. వెంటనే తన భార్యకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని స్నేహితులను కోరాడు. సోమశేఖర్‌ మాటాల్లో ఏదో తేడా కొడుతుందని భావించిన స్నేహితులు అతడి భార్యకు కాల్‌ చేశారు. ఆమె తన భర్తకు కరోనా వచ్చిందని.. మగాది రోడ్‌లోని ఆస్పత్రిలో ఉన్నాడని వారికి తెలిపింది. దాంతో సోమశేఖర్‌ స్నేహితులు ఆస్పత్రికి వెళ్లి కనుక్కోగా అతడి భార్య మాటలు అబద్ధం అని తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి సోమశేఖర్‌ భార్యను విచారించారు. దాంతో మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. ప్రస్తుతం పోలీసులు బాధితుడి భార్య, లవర్‌, అతడి తల్లి, వారికి సాయం చేసిన బీబీఎంపీ డాక్టర్‌ని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement