Vemulawada Crime: చాటింగ్‌ చేసి నిండా ముంచిన ‘వంటలక్క’ - Sakshi
Sakshi News home page

చాటింగ్‌ చేసి నిండా ముంచిన ‘వంటలక్క’

Published Sun, Apr 11 2021 2:39 PM | Last Updated on Mon, Apr 12 2021 9:43 AM

Vemulawada Police Arrested A Woman who Cheated A Young Boy By Chatting - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సీఐ బన్సీలాల్‌

సాక్షి, వేములవాడరూరల్‌: వంటలు చేసే ఓ మహిళకు దుబాయిలో ఉండే వేములవాడ మండల యువకుడి ఫోన్‌ నంబర్‌ లభించింది. మాటలతో అతడిని మాయ చేసింది. పేరు మార్చి చాటింగ్‌ చేస్తూ రూ.15లక్షలు వసూలు చేసింది. మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. వేములవాడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శనివారం అరెస్టు చేశారు. వేములవాడ రూరల్‌ సీఐ బన్సీలాల్‌ శనివారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించాడు. వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల గంగారెడ్డి ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉంటున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన పుట్ట సునీత శుభకార్యాల్లో వంట పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు దొరికిన పుస్తకంలో గంగారెడ్డి ఫోన్‌నంబర్‌ లభించింది. ఆ నంబరుతో ఆమె చాటింగ్‌ ప్రారంభించింది.

హైదరాబాద్‌కు చెందిన నందుగా గంగారెడ్డితో పరిచయం చేసుకుంది. టిక్‌టాక్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేసి తనవేనని పంపించింది. మూడు నెలల తర్వాత గొంతుమార్చి తన పేరు వైశు అని, తాను నందు స్నేహితురాలినని పరిచయం చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి జగిత్యాల వెళ్తుండగా నందు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిందని నమ్మించింది. ఆమె మొబైల్‌ఫోన్‌లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని, తనకు కొంత డబ్బు ఇస్తే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పనని బెదిరించింది.

ఆ తర్వాత తన పేరు సునీత అని మళ్లీ పేరు మార్చుకుని గంగారెడ్డికి ఫోన్‌చేసింది. నందు, వైశు ఇద్దరూ మృతిచెందారని, ఇందుకు నీవే కారణమని మరోసారి బెదిరించి గంగారెడ్డిని డబ్బు డిమాండ్‌ చేసింది. ఇలా గంగారెడ్డికి జగిత్యాలకు చెందిన జిరాక్స్‌ షాపు నిర్వాహకుడు ఇటిక్యాల రవి బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చింది. అందులో పలుసార్లు డబ్బు వేయాలని సూచించింది. డబ్బులు పంపకుంటే ఇద్దరి మృతికి నువ్వే కారణమని చెబుతానని బెదిరించింది. భయానికి గురైన గంగారెడ్డి ఖాతా నంబరుకు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.15లక్షల వరకు పంపించాడు. దుబాయి నుంచి వచ్చిన గంగారెడ్డి ఈ విషయంపై ఈ నెల 8న వేములవాడ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బన్సీలాల్, ఎస్సై మాలకొండరాయుడు, సిబ్బంది రంగంలోకి దిగారు. సదరు మహిళ, ఆమెకు సహకరించిన ఇటిక్యాల రవిని వేములవాడ కోర్టు ప్రాంతంలో శనివారం పట్టుకున్నారు. సునీతను విచారించి, రూ.35వేలు, తులం బంగారు గొలుసు, మొబైల్‌ ఫోన్, బ్యాంకు పాస్‌బుక్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement