
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ కారణంగా.. భర్త ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. వకీల్ అహ్మద్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. అతను షికార్‌పూర్ గ్రామంలో ఉండేవాడు. మసీదులో పనిచేసేవాడు. ఈ క్రమంలో, 57 ఏళ్ల వకీల్.. తన రెండో భార్య హజ్రాతో తాను మరో వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీన్ని హజ్రా తీవ్రంగా వ్యతిరేకించింది. భర్తకు ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించింది. అయితే, వకీల్ మాత్రం పెళ్లి విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవి.
భర్త ప్రవర్తన పట్ల హజ్రా విసిగి పోయింది. కొన్ని రోజులుగా అదును కోసం వేచి చూసింది. ఈ క్రమంలో, ఒకరోజు వకీల్ పడుకొని ఉన్నప్పుడు అతని ముఖంపై పిడిగిద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా కిచెన్‌లోని కత్తితో అతని పొట్టపై విచక్షణ రహితంగా పొడిచింది. ఆ కత్తిపోట్లకు వకీల్ అక్కడే మరణించాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మొదటి భార్య ఇంట్లో లేదు. కాసేపటికి బయట నుంచి వచ్చిన ఆమె రక్తపు మడుగులో ఉన్నభర్తను చూసి షాక్‌కు గురైంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన భోరాకలాన్ పోలీసులు హజ్రాను అదుపులోకి తీసుకుని వకీల్ అహ్మద్ శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కాగా, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీస్ అధికారి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment