amalapuram woman complained police man cheated her - Sakshi
Sakshi News home page

‘నన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్నాడు’

Published Sun, May 23 2021 8:24 AM | Last Updated on Sun, May 23 2021 12:09 PM

Woman Complained To Police That Man Cheated Her - Sakshi

అమలాపురం టౌన్‌ (తూర్పుగోదావరి): ఆ యువకుడికి ఆ రోజు రాత్రి పెళ్లి. మధ్యాహ్నం తన ఇంటి వద్ద బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకున్నాడు. కొద్దిసేపటిలో వధువు ఇంటికి బంధువర్గంతో బయలుదేరనున్నాడు. ఇంతలో ఓ గిరిజన మహిళ వచ్చి అతడికి, తనకు ఆరేళ్ల కిందటే పెళ్లయిందని.. తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగలేదు. వరుడి ఇంటికి, ఆ వెంటనే వధువు ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది.

దీంతో వధువు కుటుంబీకులు సంకట స్థితిలో పడ్డారు. మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన భోగిశెట్టి వీర వెంకట అయ్యప్పస్వామి రాజమహేంద్రవరంలో ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అయినవిల్లి మండలం విలసకు చెందిన దగ్గర బంధువైన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. వీరి వివాహం శుక్రవారం రాత్రి వధువు ఇంటి వద్ద జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి సొంతూరు చల్లపల్లిలో బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకుని, వేడుక చేసుకున్నాడు. సాయంత్రం బంధువర్గంతో వధువు ఊరు విలసకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల నుంచి రెండేళ్ల బాలుడితో ఓ గిరిజన మహిళ, తన బంధువులతో కలిసి కారులో ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఆరోగ్య శాఖలో ఉద్యోగి. అయ్యప్పస్వామి తన భర్తని, తమకు ఓ కుమారుడు కూడా పుట్టాడని, అతడికి ఇప్పుడు వేరే పెళ్లి జరుగుతోందని, దీనిని ఆపాలని అభ్యర్థించింది. అయితే ఇందుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆమె, బంధువులు నేరుగా చల్లపల్లి వెళ్లారు. అయ్యప్పస్వామి బంధువులకు విషయం చెప్పారు. అక్కడి నుంచి విలస వెళ్లి వధువు ఇంట్లోనూ ఇదే విషయాన్ని వివరించారు. ఈ వివాదంతో మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికే ఆ గిరిజన మహిళ అయ్యప్పస్వామిపై రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

అమలాపురంలో బహుజన మహిళా శక్తి సంస్థ జాతీయ అధ్యక్షురాలు కొంకి రాజామణిని కూడా ఆశ్రయించింది. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. ఆ గిరజన మహిళ శుక్రవారం తమ స్టేషన్‌కు వచ్చి అయ్యప్పస్వామి పెళ్లి ఆపాలని కోరిందని, అతడు ఆమె భర్తని తగిన ఆధారాలు చూపిస్తేనే చర్యలు చేపడతామని చెప్పానని ఉప్పలగుప్తం ఎస్సై వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ఆమె వారి పెళ్లి ఆధారాలు చూపించలేదని అన్నారు. దీంతో ఆమె, ఆమెతో పాటు వచ్చిన బంధువులు చల్లపల్లిలోని అయ్యప్పస్వామి ఇంటికి వెళ్లారని చెప్పారు. ఆ గిరిజన మహిళతో గతంలో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే తమ ఇద్దరికీ పెళ్లి జరగలేదని.. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వరుడు అయ్యప్పస్వామి ‘సాక్షి’కి చెప్పారు.

చదవండి: ‘యాస్‌’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు   
గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్‌ నిజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement