ప్రతీకాత్మక చిత్రం
ఇండోర్ : ఎక్కడ చూసినా, ఎవర్ని చూసిన సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. యువత సమయంతో సంబంధ లేకుండా ఫోన్‌లోనే కాలక్షేపం చేస్తూ సెల్ఫీలకు బానిసవుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ప్రాణాలు వదులుకున్న సందర్భాలు గతంలో చాలా ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ఆలోచించకుండా దిగరాని చోట్ల సాహసాలు చేసి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ దిగుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.
ఇండోర్ నగరానికి చెందిన 30 ఏళ్ల మహిళ పిక్నిక్ స్పాట్ లో సెల్ఫీ దిగుతూ లోయలో జారి పడి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నీతూ మహేశ్వరి సరదగా గడపడానికి కుటుంబంతో కలిసి పిక్నిక్ కోసం ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గేట్ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. కొండ మీద సెల్ఫీ దిగుతూ జారిపడి లోయలో పడిందన్నారు. నాలుగు గంటల గాలింపు తరువాత లోయ నుంచి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment