
పెళ్లి కోసం దాచిన 50 వేల నగదు, విలువైన నగలు పట్టుకుపోయింది. ‘‘ నేను ఇళ్లు వదిలి పోతున్నా’’ అని...
లక్నో : ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక.. పెళ్లికి 15 రోజుల ముందు ఇంట్లోంచి పారిపోయిందో యువతి. పోతూపోతూ పెళ్లి ఖర్చుల కోసం దాచిన నగదును, విలువైన బంగారు నగలను పట్టుకుపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హంపీపూర్, బర్సార్ పోలీస్ స్టేషన్ పరిథికి చెందిన ఓ యువతికి కొన్ని నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. జులై నెలలో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబసభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంగారు నగలు కొని పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19న సదరు యువతి ఇంటినుంచి పారిపోయింది. పోతూపోతూ పెళ్లి కోసం దాచిన 50 వేల నగదు, విలువైన నగలు పట్టుకుపోయింది. ‘‘ నేను ఇళ్లు వదిలి పోతున్నా’’ అని చిన్న చీటీ రాసి పెట్టిపోయింది.
దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురికి ప్రముఖ సింగర్ రందావా అంటే విపరీతమైన ఇష్టమని, ట్విటర్‌లో తరుచూ అతడి పోస్టులను రీట్వీట్ చేసేదని తెలిపారు. ఆమెకు రందావా ఫ్రెండ్ అని చెప్పుకుని ఓ వ్యక్తి పరిచమయ్యాడని చెప్పారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అతడే తమ కూతుర్ని నమ్మించి ఉంటాడని, ఇళ్లు వదిలి అతడి దగ్గరకే పారిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి : వామ్మో.. కిలేడీ గ్యాంగ్.. బంగారం కొనేందుకు వచ్చి.. ఎంత పనిచేశారు!