రోదిస్తున్న మృతుడి భార్య నీల, బంధువులు
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ కాలనీ శివారు చెరువుకట్ట సమీపంలో గురువారం ఓ గిరిజన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడి కళ్లలో కారంపొడి చల్లి ఇనుపరాడ్డు, కర్రతో తలపై బలంగా దాడి చేసి గాయపరచడంతో అతడు అక్కడికక్కడే రక్తం మడుగులో పడి మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. టౌన్ ఎస్‌హెచ్‌ఓ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామశివారు సున్నపు రాళ్ల తండాకు చెందిన బానోత్ లక్‌పతి(35)కి భార్య నీల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
లక్‌పతి మానుకోటలోని మిల్ట్రీకాలనీలో నివాసం ఉంటూ గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం 9గంటల సమయంలో అతడికి ఒకరు ఫోన్ చేయగానే ఇంట్లో నుంచి తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. నందినగర్ కాలనీ శివారులో గల చెరువుకట్ట సమీపంలోకి చేరుకున్నాక కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడితో వాగ్వాదానికి దిగారు. అదేక్రమంలో లక్‌పతి కళ్లలో కారంపొడి చల్లి, ఇనుప రాడ్డుతో, కర్రతో తలపై, శరీరంపై బలంగా గాయపరిచారు. కొంత పెనుగులాట జరిగిన అనంతరం యువకుడు మృతి చెందినట్లు గుర్తించి ఆ వ్యక్తులు అతడి ముఖంపై దుప్పటి కప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
చదవండి: ప్రేమ వివాహం.. వేధింపులు.. ఇక భర్తతో కలిసి ఉండలేనని..
ద్విచక్రవాహనం సంఘటనా స్థలంలో పడిపోయి ఉంది. కొంత దూరంలో ఇనుపరాడ్డు, కారంపొడి డబ్బా, కర్ర, మాస్కు, మృతుడి కాలిబూటు పడిఉన్నాయి. సంఘటనా స్థలాన్ని సబ్ డివిజినల్ పోలీసు అధికారి పి.సదయ్య సందర్శించారు. టౌన్ ఎస్సైలు క్రాంతికిరణ్, ఎస్సై రవి, దీపిక, రమాదేవి, హెడ్‌కానిస్టేబుల్ వెంకటరమణ, పీసీలు శ్రీకాంత్, రమేష్ వివరాలు సేకరించారు.
చదవండి: మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనూజ కేసు: విజయవాడ ఎందుకు వచ్చింది..
లక్‌పతి(ఫైల్)
కాగా, బానోత్ లక్‌పతి హత్యకు గల కారణం అతడు తండాకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతోనే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా గతంలోనూ ఇదేవిధంగా లక్‌పతిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే విషయంలో పలుమార్లు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు తెలిసింది. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీ చేయిస్తున్నారు. మృతుడి తండ్రి రాజ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటరత్నం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment