
ప్రతీకాత్మక చిత్రం
తొండూరు(వైఎస్సార్ జిల్లా): మండలంలోని ఊడవగండ్ల గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన రామిరెడ్డి సహదేవరెడ్డి(66)ని మచ్చుకొడవలితో అతి కిరాతకంగా నరికారు. రూరల్ సీఐ బాలమద్దిలేటి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన రామిరెడ్డి సహదేవరెడ్డికి అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి గంగిరెడ్డి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం కలగడంతో.. మా ఇంటి వద్దకు ఎందుకు వచ్చావని గంగిరెడ్డి మందలించారు.
దీంతో సహదేవరెడ్డికి, గంగిరెడ్డికి మాటకుమాట పెరిగి వాగ్వాదం జరుగుతుండగా.. గంగిరెడ్డి అన్న కుమారుడు ప్రహ్లాదారెడ్డి మచ్చుకొడవలితో సహదేవరెడ్డిపై దాడి చేశారు. గతంలో సహదేవరెడ్డి, గంగిరెడ్డి మధ్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సహదేవరెడ్డి తీరు మారకపోవడంతో గంగిరెడ్డి ఇంటి సమీపంలో అరుగు మీద కూర్చొన్న సహదేవరెడ్డిని చూసి కోపోద్రిక్తులై సంఘటన జరిగినట్లు తెలిపారు.
సహదేవరెడ్డి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. కుటుంబ సభ్యులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హనుమంతు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?
Comments
Please login to add a commentAdd a comment