సాక్షి, అమలాపురం: ఓ సోడా కొట్టవోయ్.. ఒకప్పుడు పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా వినిపించే మాట ఇది. పొలాల నుంచి అలసిసొలసి వచ్చిన రైతులు, కూలీలు, వాహనాలపై దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణీకులకు దప్పిక తీర్చేది గోలీ సోడానే. గోలీ సోడా.. సోడా బుడ్డి.. గ్యాస్ సోడా.. ఇలా పేరేదైనా ఒకప్పుడు సామాన్యుడి దప్పిక తీర్చే పానీయం ఇది. గోలీ సీసాలో గ్యాస్‌తో కలగలిసిన నీళ్లు (కార్బొనేటెడ్ వాటర్) గొంతులోకి దిగుతూంటే కలిగే అనుభూతే వేరు. అందుకే గోలీ సోడా గమ్మత్తయిన ఎవర్‌గ్రీన్ పానీయం. సాఫ్ట్ డ్రింకులు వచ్చిన తరువాత వీటికి డిమాండ్ తగ్గింది. పాన్ షాపుల్లో కొంత మంది మాత్రమే సోడాలు విక్రయించేవారు. కాలం మారింది. సోడాకు పూర్వ వైభవం వచ్చింది. థమ్సప్, పెప్సీ తరహాలో గోలీ సోడా కూడా కార్పొరేట్ హంగులు అద్దుకుంది. కొత్త రుచులతో పల్లెల్లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంటోంది.
పళని స్వామి.. పద్దెనిమిది రకాల సోడాలు
అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన వర్రే రామకృష్ణ ‘పళని స్వామి గోలీ సోడా’ పేరుతో పాన్‌షాప్ నడుపుతున్నారు. గతంలో తమిళనాడు ప్రాంతంలో కొబ్బరి కారి్మకునిగా పని చేసిన ఆయన కరోనా సమయంలో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అంబాజీపేటలోని పి.గన్నవరం మెయిన్ రోడ్డును ఆనుకుని పాన్‌షాప్ ఆరంభించారు. తొలినాళ్లలో సాదా రకం, నిమ్మ సోడాలు మాత్రమే అమ్మేవారు. క్రమంగా సోడాను సరికొత్త రుచులతో అందించాలని నిర్ణయించారు. నీళ్ల సోడా, నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, లెమన్, పైనాపిల్, సుగంధి, సిట్రా, వామ్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మ్యాంగో, రోజ్, వాటర్ మిలన్, వెనిల్లా, కాలాకట్టా, గ్రీన్ ఆపిల్, నేరేడు రకాల ఫ్లేవర్లతో సోడాలు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో 700 వరకూ సోడాలు అమ్మే రామకృష్ణ వేసవిలో 1,200 పైగా విక్రయిస్తారు. ‘ఒకదాని తరువాత ఒకటి కొత్త రుచితో సోడాలు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాను. ఇప్పుడమ్ముతున్న దాని కన్నా ఇంకా ఎక్కువ సోడాలు అమ్మే అవకాశముంది. కానీ కూలింగ్ సరిపోవడం లేదు. పూర్తి స్థాయి కూలింగ్ లేకపోతే సోడా రుచి ఉండదు’ అని రామకృష్ణ చెప్పారు.
తోపుడు బండిపై.. 52 ఏళ్లుగా..
అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన దాçసరి సత్యనారాయణ 52 ఏళ్లుగా తోపుడు బండిపై గోళీ సోడాలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు వయస్సు 68 ఏళ్లు. కె.పెదపూడి, పుల్లేటికుర్రు, ఇరుసుమండ, ముక్కామల, వ్యాఘ్రేశ్వరం గ్రామాల్లో రో డ్ల మీద బండి తోసుకుంటూ వెళ్లి ఆయన సోడాలు విక్రయించేవా రు. తొలి రోజుల్లో ఒక్కో సోడా పది పైసలకు అమ్మేవారు. ఇప్పు డు సాదా రూ.5, నిమ్మ సోడా రూ.8కి అమ్ముతున్నా రు. ‘నేను సోడాలు అమ్మే గ్రామాల్లో సోడా బడ్డీలు న్నా నా దగ్గరే తాగేవారు. గతంలో రోజుకు ఎనిమిదిసార్లు తోపుడు బండి నింపి 560 వరకూ సోడాల అమ్మకాలు చేసిన రోజులు న్నాయి. వయస్సు పెరగడంతో ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్లలేకపోతున్నాను’ అని సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు.
తోపుడు బండిపై సోడాలు విక్రయిస్తున్న సత్యనారాయణ
66 ఏళ్లుగా సిట్రా షోడా
పి.గన్నవరం మండలం నాగుల్లంక పేరు చెప్పగానే చాలా మందికి సిట్రా సోడా గుర్తుకు వస్తుంది. పి.గన్నవరం – రాజోలు ప్రధాన రోడ్డును ఆనుకుని నాగుల్లంకలో ఉన్న దుర్గా కూల్‌డ్రింక్స్ అండ్ పాన్ షాపులో సిట్రా సోడాకు మంచి డిమాండ్ ఉంది. ఈ సోడాను కంకటాల నెరేళ్లు 1957లో ప్రారంభించారు. అప్పటి నుంచి అంటే.. సుమారు 66 ఏళ్లుగా వారు సిట్రా సోడాలు అమ్ముతున్నారు. తొలుత వీరు గోలీ సీసాల్లో సిట్రా షోడాలు విక్రయించగా, ఇప్పుడు మెషీన్‌తో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షాపును నెరేళ్లు కుమారులు శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, ఈశ్వరరావు, సత్యనారాయణ నిర్వహిస్తున్నారు. ‘సోడా అమ్మకాల విధానంలో మార్పు వచ్చినా.. ఫార్ములా పాతదే. రుచి కూడా అదే. అందుకే ఇన్నాళ్లయినా మా వద్ద డిమాండ్ తగ్గలేదు’ అని ఈశ్వరరావు చెప్పారు.
కార్పొరేట్ గోలీ సోడా
శీతల పానీయాలనే కాదు.. గోలీ సోడాలను సైతం కొత్త రుచులతో మార్కెట్ చేస్తూండటం కార్పొరేట్ సంస్థలకు ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారులు ఇప్పుడు గోలీ సోడా అమ్మకాలు చేపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా ఈ కార్పొరేట్ గోలీ సోడాలు పల్లెలకు సైతం వస్తున్నాయి. రకరకాల ఫ్లేవర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment