
జస్టిస్ మల్లికార్జునరావుకు చిత్రపటం ఇస్తున్న అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ
దేదీప్యంగా అప్పనపల్లి బాలాజీ స్వామి
మామిడికుదురు: ఆ స్వామివారి దివ్య స్వరూపం.. చూసిన కనులదే భాగ్యం.. పవిత్ర మాఘమాసం శనివారం కావడంతో అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు దీరిన ఆ స్వామిని దర్శించుకుని ప్రతి హృదయం ఉప్పొంగింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయంలో శ్రీలక్ష్మీనారాయణ హోమంతో పాటు స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా జరిగాయి. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1.58 లక్షల ఆదాయం సమకూరింది. టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.14 లక్షలు, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.44,090 విరాళాలుగా వచ్చాయి. 2,863 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 2,095 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈఓ గ్రంధి మాధవి, ధర్మకర్తల మండలి చైర్మన్ చిట్టూరి రామకృష్ణ, ట్రస్టు బోర్డు సభ్యులు చిట్టాల సత్తిబాబు, గూటం శ్రీనివాస్, కొమ్ముల సూరిబాబు పర్యవేక్షించారు.
అంతర్వేదిలో హైకోర్టు న్యాయమూర్తి
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో శనివారం ఏపీ హైకోర్టు జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా పూజలు చేశారు. తొలుత ఆయనకు ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు ఎస్‌బీఎం రమేష్ స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ అందజేశారు.
ఫ అంతర్వేది తీర్థ మహోత్సవాల్లో భక్తులకు విక్రయించేందుకు ప్రాథమికంగా 2.25 లక్షల లడ్డూ ప్రసాదం తయారు చేయిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. 80 గ్రాముల లడ్డూ ప్రసాదం ఒక్కటి రూ.15 అన్నారు. భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 1.30 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు.
పోక్సో కేసులో
ఇద్దరికి జైలు శిక్ష
అమలాపురం టౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఇద్దరికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. అప్పటి చింతూరు డీఎస్పీ, ప్రస్తుత కోనసీమ జిల్లా ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఈ కేసును దర్యాప్తు చేశారు. చింతూరు మండలం కుమ్మూరు పంచాయతీ శివారు కోయ మామిళ్లగూడెంలో నమోదైన పోక్సో కేసులో నిందితులు మిడియం రమేష్, ముచ్చిక లక్ష్మణరావుల నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ఓ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారన్న అభియోగంపై నిందితులిద్దరికీ ఈ శిక్ష పడింది.

అప్పనపల్లిలో బాల బాలాజీ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment