
పామర్రు గ్రామంలో కేంద్ర బలగాల కవాతు
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో కోడి పందేలు, పేకాటలతో పాటు అక్రమం మద్యం, నగదు రవాణాలపై అధికారుల తనిఖీలు, దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా జిల్లాలో 51 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.28 లక్షలు, 13 కోడి పుంజులను స్వాధీ నం చేసుకున్నారు. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో పోలీస్, ఎస్‌ఈబీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు జిల్లాలో మంగళవారం చేపట్టిన తనిఖీలు, దాడుల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది.
● కాట్రేనికోన పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి నుంచి 17 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 3.06 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
● రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట, కోడి పందేలపై దాడులు చేసి 43 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 కోడి పుంజులు, 10 కోడి కత్తులు, 15 మోటారు సైకిళ్లు, మూడు కార్లు, రూ.1.28 లక్షల నగదు సీజ్ చేశారు.
● అమలాపురం, ముమ్మిడివరం, ఆలమూరు, రాజోలు, రామచంద్రపురం, కొత్తపేట ఎస్‌ఈబీ స్టేషన్ల పరిధిలో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 14 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 8.34 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
● జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నరసాపురపుపేటల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి.
● సమస్యాత్మక గ్రామమైన పామర్రులో పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి బుధవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. పోలింగ్ బూత్‌లకు నిర్భయంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు మేమంతా బందోబస్తుతో భరోసాగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చాయి.
51 మంది అరెస్ట్, రూ.1.28 లక్షల స్వాధీనం
విస్తృతంగా అధికారుల తనిఖీలు