ఇంటి ముందు భార్య బైఠాయింపు
ఆలమూరు: తన భర్తతోనే జీవనం సాగిస్తానని, తనను ఇంట్లోకి ఆహ్వానించకుంటే ఇంటి ముందు నుంచి కదిలేది లేదంటూ భార్య ఆలమూరు మండలంలోని పినపళ్లలో నిరసన తెలిపింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఇల్లూరి రవికుమార్‌కు 2022 మే 21న వివాహమైంది. ఏడాది దాటాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రవికుమార్ తన భార్య సత్యవతిని మండపేట మండలంలోని ఏడిదలో పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి పలుమార్లు పెద్దల ద్వారా రవికుమార్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో భార్య సత్యవతి సోమవారం తన భర్త ఇంటి బయట బంధువులతో కలిసి బైఠాయించింది. ఇంట్లోకి రమ్మనే వరకూ ఇంటి ముంగిటనే ఉంటానని తెలిపింది. దీనిపై స్థానికులు స్థానిక మహిళ సంరక్షణ కార్యదర్శి కె.సత్యనారాయణమ్మకు ఫిర్యాదు చేయగా ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆలమూరు ఎస్సై ఎం.అశోక్‌కు ఆమె సమాచారం అందించారు.
కౌన్సెలింగ్ ఇస్తాం : రెండేళ్ల నుంచి విడిపోయి ఉంటున్న భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని ఎస్సై అశోక్ తెలిపారు. నిరసన వీడి పోలీసు స్టేషన్‌కు రావాలని బాధిత మహిళ సత్యవతికి, కుటుంబ సభ్యులకు ఫోన్‌లో వివరించారు. భర్త రవికుమార్ స్పందించకుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం స్థానికుల సాయంతో బాధిత కుటుంబాన్ని మహిళా సంరక్షణ కార్యదర్శి సత్యనారాయణమ్మ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment