ఆగని దోఫ్రీడీ
సాక్షి, అమలాపురం: ‘తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత... దోచుకున్నవారికి దోచుకున్నంత’ అన్నట్టుగా ఉంది కూటమి పాలనలో ఉచిత ఇసుక పాలసీ. పగలు, రాత్రి అనే తేడా లేదు.. అధికార ర్యాంపు.. అనధిరార ర్యాంపు అనే భేదం లేదు, ఎక్కడైనా వసూళ్ల దందా పెద్ద ఎత్తున నడుస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ర్యాంపుల్లో కూడా అడ్డగోలు దోపిడీ సాగిపోతోంది. దీనివల్ల వినియోగదారులకు ఉచిత ఇసుక కాస్తా కొనలేనంత భారంగా మారింది. కోనసీమ జిల్లాలో అధికారికంగా ప్రకటించిన ర్యాంపులు మొత్తం 15. జిల్లాస్థాయి శాండ్ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో తొలి దశలో అంకంపాలెం, నార్కెడిమిల్లి, పొడగట్లపల్లి–1, పొడగట్లపల్లి–2, పులిదిండి, వద్దిపర్రు –1, వద్దిపర్రు–2, ఆలమూరు, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం, తాతపూడి, ఊబలంక కలిపి మొత్తం 12 ర్యాంపులు అనుమతించగా, రెండోదశలో గోపాలపురం, అంకంపాలెం–2, పొడగట్లపల్లి–3, మూడు ర్యాంపులున్నాయి. వీటిలో మిథులా కంపెనీ టెండర్ దక్కించుకున్న పొడగట్లపల్లి–2, ఆలమూరు రీచ్‌లలో ఇప్పటి వరకు ఎటువంటి తవ్వకాలు జరగడం లేదు.
యథేచ్ఛగా నిబంధనలకు పాతర
వీటిలో రెండు రీచ్‌లు మినహా మిగిలిన పదమూడు రీచ్‌లు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాయి. రెండు మాత్రం మండపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ రెండు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి చెందిన నేతల హవా కొనసాగుతోంది. ర్యాంపులు దక్కించుకున్నవారితో స్థానిక నాయకులు చేతులు కలిపారు. వారి కనుసన్నలలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమిలో ఉన్న జనసేన సైతం తమకు వాటా కావాలని పట్టుబట్టడంతో వారికి రెండు, మూడు లారీలు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ర్యాంపులే ఉన్నా నిబంధనలకు విరుద్ధం జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. ర్యాంపుల్లో యంత్రాలతో తవ్వకాలు, గట్ల చెంతన నిల్వ చేయకుండా నేరుగా ర్యాంపుల నుంచే రవాణా చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.
ఆత్రేయపురంలో చెలరేగిపోతున్న మాఫియా
ఆత్రేయపురంలో అధికాార ర్యాంపు వద్ద టీడీపీ అనుకూల ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. పగటిపూట కొన్ని ర్యాంపులలో సక్రమంగా, రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడిమిల్లి, పులిదిండి, వద్ధిపర్రు, ఆత్రేయపురం గ్రామాల్లో ఉన్న ఎనిమిది రీచ్‌లలోనూ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ రాంపుల్లో కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో వాటాలు పంచుకుంటున్నారు. వీరికి కీలకనేత అండదండలు ఉండడంతో అధికార యంత్రాంగం చేష్టలుడి చూస్తోంది. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాలకు పెద్దపెద్ద బాటలు వేసి తవ్వకాలు చేస్తున్నారు. ర్యాంపుల వద్ద నుంచే రోజూ వందలాది లారీల ఇసుక తరలిపోతోంది. స్టాక్ పాయింట్‌ల వద్ద ఇసుక కన్నా రెట్టింపు సంఖ్యలో ర్యాంపుల నుంచి నేరుగా ఇసుక తరలిపోతోంది. ఇలా తరలిస్తున్న ఇసుకకే అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక అయినా పగటిపూట లారీకి రూ.వెయ్యి చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. రాత్రులు అంకంపాలెం, వద్దిపర్రు నుంచి అక్రమ తవ్వకాలు చేస్తూ లారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, డిమాండ్‌ను బట్టి రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన ర్యాంపులు ఊబలంక, పొడగట్లపల్లి రాంపుల్లో పగటి పూట మాత్రమే తవ్వకాలు నిర్వహిస్తున్నారు. కాని ఇక్కడ కూడా లారీకి అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలో కీలక మద్యం వ్యాపారులే ఇక్కడ ఇసుక దందా కూడా చేస్తుండడం గమనార్హం. వీరి అక్రమ రవాణాకు డెల్టాలో కీలకమైన లొల్ల లాకులు సైతం దెబ్బతింటున్నాయి.
రావులపాలెం మండలం పొడగట్లపల్లి ర్యాంపు వద్ద స్టాక్ పాయింట్ నుంచి ఇసుక ఎగుమతి
జట్టు కార్మికులు ఆందోళన చేసినా పట్టని అధికారులు
మండపేట పరిధిలో మందపల్లి, కపిలేశ్వరపురంలో యంత్రాలతో లోడింగ్ చేస్తున్నారు. రాత్రి సమయంలోనూ తవ్వకాలు జరుపుతున్నారు. దానితో ఆగ్రహం చెందిన జట్టు కార్మికులు ఈనెల 7న ర్యాంపు వద్ద వాహనాలను నిలుపుదల చేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తమకు పని లేదని పంపివేసి యంత్రాలతో లోడింగ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు గాని, ఇటు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కాని అడ్డుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ కీలక నేతల అండదండలు ఉండడం, తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగా కింద నుంచి పై వరకు ప్రతి ఒక్కరికీ ఈ దందాలో సొమ్ము అందుతుండడంతో కిక్కురుమనకుండా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోనసీమ జిల్లాలో అధికార రీచ్‌లు 15
నిబంధనలకు విరుద్ధంగా
ర్యాంపుల్లో తవ్వకాలు
పగటి పూట సక్రమం...
రాత్రి వేళల్లో అక్రమం
లారీకి అదనంగా రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూళ్లు
వినియోగదారులపై అదనపు భారం
ఆత్రేయపురంలో చెలరేగిపోతున్న మాఫియా
Comments
Please login to add a commentAdd a comment