
అనుమానం.. ఆపై మద్యం మత్తులో భార్య హత్య
● తీర ప్రాంతం కొత్తపేటలో భర్త ఘాతుకం
తొండంగి: మద్యం మత్తులో భార్యను హతమార్చిన ఘటన మండలం యర్రయ్యపేట పంచాయతీ కొత్తపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ దుమ్ములపేటకు చెందిన గోసల దారకొండకు యర్రయ్యపేటకు చెందిన చొక్కా భూలోకం, కొండమ్మల రెండో కుమార్తె చొక్కా పద్మ(34)తో సుమారు పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ఆ భార్యాభర్తలు కొత్తపేటలోనే ఉంటున్నారు. వీరికి కుమారుడు సిద్ధు, కుమార్తె లాస్య ఉన్నారు. దారకొండ మద్యానికి బానిసై అనుమానంతో తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గ్రామంలోనే చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని పద్మ తన కుటుంబాన్ని పోషిస్తోంది. శనివారం రాత్రి కొత్త అమావాస్య సందర్భంగా డీజే చూసేందుకు వెళ్లిన పద్మను ఇంటికి రమ్మని దారకొండ కుటుంబసభ్యులతో కబురు పంపాడు. ఇంటి వచ్చిన పద్మతో దారకొండ వాగ్వివాదానికి దిగి ఆమెను హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా గోనె సంచి తొడిగి మంచం కింద దాచి దానికి చాప అడ్డుపెట్టాడు. కొంత సేపటికి కుటుంబసభ్యులు వచ్చి ఆమె కోసం ప్రశ్నించగా ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పడంతో వారు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో మళ్లీ ఇంటికి వచ్చి మంచం కింద విగతజీవిగా ఉన్న పద్మను గుర్తించారు. ఈ లోపే దారకొండ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వాకదారిపేటలో ఉన్న దారకొండను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై జగన్మోహన్‌రావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు సిద్దూ, లాస్య జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. పద్మ మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీమున్నీరవుతున్నారు.
పద్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు