
నేటి నుంచి తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు
● లోవ గ్రామంలో 26న జాగరణ
● 27న తీర్థం, ఊరేగింపు
● పలు గ్రామాల్లో జాతరలకు భారీ ఏర్పాట్లు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు ఆదివారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ జరగనున్నాయి. ప్రతి సంవత్సరం గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరు గ్రామంలో తలుపులమ్మ తల్లికి పుట్టింటి సంబరాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానం ఆవరణలో నెల రోజులు ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పుట్టింటి సంబరాల సందర్భంగా 14 రోజుల ఉత్సవాల అనంతరం అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థం నిర్వహిస్తారు. గ్రామస్తుల అభీష్టం మేరకు లోవ దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోవ గ్రామంలో ఉపాలయం వద్ద నాలుగెకరాల విస్తీర్ణంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా పేలుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, వారి ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులు లోవ కొత్తూరు వచ్చి గంధామావాస్య ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు అవసరమైన ఖర్చును లోవ దేవస్థానం నుంచి భరిస్తామని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.
సంబరాలు జరుగుతాయిలా..
మొదటి రోజయిన ఆదివారం గరగల సంబరాలతో అమ్మవారి పుట్టింటి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. వివిధ గ్రామాల్లో గరగలను ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. 26వ తేదీ రాత్రి జాగరణ, 27న అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 26న 50 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు, కేరళ లేడీ డ్రమ్స్ టీమ్, కాంతార లైటింగ్ డ్యాన్స్ టీమ్, గోపాల గోపాల ప్రోగ్రాం, పెద్ద ఆంజనేయ బృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 27న వివిధ వాహనాలపై బళ్ల వేషాలు, నక్కపల్లి వారి మ్యూజికల్ బ్యాండ్, 60 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
వివిధ గ్రామాల్లో..
లోవ దేవస్థానం పరిసర ప్రాంతవాసులకు తలుపులమ్మ తల్లి ఇలవేల్పు కావడంతో గంధామావాస్య రోజున వివిధ గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వి.కొత్తూరు, కొత్త వెలంపేట, సీతయ్యపేట, మర్లపాడు, రాజుపేట, జగన్నాథగిరి, గెడ్లబీడు, వెలంపేట కాలనీ, తాళ్లూరు, కుమ్మరిలోవ తదితర గ్రామాల్లో వేర్వేరుగా తలుపులమ్మ తల్లి జాతర భారీగా నిర్వహిస్తారు. దీని కోసం ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యాన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రదర్శనల్లో వెండి తెర, బుల్లి తెర నటీనటులు పాల్గొని ఆయా గ్రామస్తులను అలరించనున్నారు.

నేటి నుంచి తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు