
పర్యావరణ రక్షణతో మానవ మనుగడ
పిఠాపురం: మానవుడు తన స్వార్థం కోసం పంచభూతాలను కలుషితం చేసి, వాటిలో సమతుల్యత పాడుచేసి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాడని, పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. పంచభూతాలతో కూడిన ప్రకృతి ద్వారా భూమిపై జీవించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం భవిష్యత్‌లో జరగబోయే అనేక విషయాలతో పాటుగా విపత్తులను గురించి కూడా సూచిస్తుందని, మేల్కొని రక్షణ చర్యలు చేపడితే పర్యావరణాన్ని కాపాడు కోవచ్చునని తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనం వంటిదే జీవితమని, జీవన గమనంలో కష్ట, సుఖాలను సమభావనతో స్వీకరిస్తేనే జీవిత పరమార్థం అర్థమవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలునాటి సంరక్షించాలని, నాటిన ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్‌తో సమానమని ఆయన అన్నారు. అనంతరం ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణురాలు కేవీవీఎస్ శారద సభలో పంచాంగ పఠనం చేశారు. ముఖ్య అతిథులు గీతావదాని యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు, ఆక్టి ఇన్ఫోటెక్ డైరెక్టర్ కమల్ బెయిడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు కృష్ణ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

పర్యావరణ రక్షణతో మానవ మనుగడ