సామర్లకోట: ఒక మహిళ చేతిలో జరిగిన అవమానాన్ని భరించలేక టిఫిన్ సెంటర్ యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. మేడిశెట్టి గోపాలకృష్ణ (45) తన సెల్‌ఫోన్ సెల్ఫీ వీడియోలో చనిపోవడానికి కారణాలను చెప్పుతూ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి పరిస్థితిని గమనించి అతని కుమార్తె బాలాత్రిపుర కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆస్పత్రిలో మృతి చెందాడు. దాంతో గోపాలకృష్ణ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ వీడియో ప్రకారం సామర్లకోట మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పోలింగ్ రింగ్ సెంటర్ వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న సమయంలో సుమారు ఏడేళ్ల క్రితం హోటల్‌లో పని చేయడానికి వచ్చిన ఏసమ్మ అనే స్థానిక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను పోషిస్తున్నాడు. ఇటీవల ఏసమ్మ తన పుట్టింటికి వెళ్లి పోవడంతో కారణం తెలుసుకోవడానికి వెళ్లిన సమయంలో ఏసమ్మ అక్క బుజ్జమ్మ, నానమ్మ శేషారత్నం బహిరంగంగా చెప్పుతో కొట్టారు.
ఆ సంఘటనను భరించలేక చనిపోతున్నానని వీడియోలో చెప్పాడు. ఏసమ్మ కోసం ఎంతో సొమ్ము ఖర్చు చేశానని వీడియోలో పేర్కొన్నాడు. ఈ మేరకు తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ఇటువంటి సంఘటన మరొకరికి జరుగకుండా చూడాలని మృతుని కుమార్తె బాలాత్రిపుర విజ్ఞప్తి చేసింది. కాగా తండ్రికి కుమార్తె బాలాత్రిపుర తలకొరివి పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వీడియో క్లిపింగ్‌ను కూడా ఆధారంగా చేసుకొంటామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment